Goodhachari 2: టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలను అందుకొని స్టార్ హీరో రేసులోకి దూసుకొస్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా తన సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టేశాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు అడివి శేష్. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి శేష్ కథను అందించాడు. గూఢచారి సినిమాలు మరుగున పడిపోతున్న సమయంలో ఈ సినిమా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ను అప్పుడే ప్రకటించిన శేష్ ఎట్టకేలకు జీ2 ను పట్టాలెక్కించాడు. అయితే ఈసారి చాలానే మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ యాడ్ అయ్యాడు. శశి కిరణ్ తిక్కా ప్లేస్ లో “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి వచ్చాడు. అతడికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇకపోతే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 మరియు మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇక తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ లో కథ మొత్తం ఇండియాలో జరుగగా.. సెకండ్ పార్ట్ లో కథ మొత్తం అంతర్జాతీయంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ లో ఫార్మల్ దుస్తులలో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఉన్న శేష్ ఎత్తైన భవనం నుంచి కిందపడుతున్నా గూఢచారి గురి మాత్రం తప్పకుండా పైన క్రిమినల్స్ పైకి బుల్లెట్స్ ను వదులుతూ కనిపించాడు. ఈ పోస్టర్ లో అడివి శేష్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ భారతదేశం నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి యొక్క చివరి విజువల్స్ గా చూపించారు. జీ2 అక్కడి నుంచే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో శేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.