ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోలు ఒకేలాంటి కథలను ఎంచుకోవాలని కోరుకోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని తమలోని నటనను ఇంకా మెరుగుపర్చుకుంటున్నారు. ఇక విభిన్న కథాంశాల హీరోగా పేరుతెచ్చుకున్న హీరో అడవి శేష్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శేష్.. మంచి మంచి కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం సెట్స్ మీద ఉండగా.. మరో చిత్రం ‘హిట్ 2’ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ‘హిట్’ చిత్రాన్ని నిర్మించి, ఘనవిజయం సాధించిన యువ దర్శకుడు శైలేష్ కోనేరు దానికి సీక్వెల్ గా హిట్ 2 ను రంగంలోకి దింపాడు.
మొదటి పార్టీ లో విశ్వక్ సేన్ నటించగా, రెండో పార్ట్ లో అడవి శేష్ నటిస్తున్నాడు. అంతేకాకుండా పార్ట్ 1 హైదరాబాద్ నేపథ్యంలో సాగితే సెకండ్ కేస్ ని ఆంధ్రా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో శేష్, కెడి అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. జూలై 29 న ఈ కేసు మిస్టర్ని కెడి ఛేదించనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో పాటు కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. కూల్ కాప్ గా అడవి శేష్ ఏదో ఆలోచిస్తూ నిలబడిన పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి త్రిపుర్నేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మర్డర్ మిస్టరి థ్రిల్లర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.