నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ను డైరెక్ట్ చేసిన చందు మొండేటి దీన్ని తెరకెక్కించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ మూవీలోని ‘అడిగా నన్ను నేను అడిగా… నాకెవ్వరు నువ్వని’ అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఉత్తర భారతానికి సంబంధించిన అందమైన లొకేషన్స్ ను ఈ పాటలో కార్తిక్ ఘట్టమనేని అద్భుతంగా కాప్చర్ చేశాడు.
హీరోహీరోయిన్లు నిఖిల్, అనుపమతో పాటుగా శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కూడా ఈ ట్రావెల్ సాంగ్ లో కనిపిస్తారు. హృదయానికి హత్తుకునేలా ఈ పాటను కృష్ణ మద్దినేని రాయగా ఇన్నో జంగా పాడారు. శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించిన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందనేందుకు ఎన్నో ఆధారాలు ఉన్నాయని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ చెబుతోంది. ఆ నేపథ్యంలోనే గతంలో వెంకటేశ్ హీరోగా ‘దేవిపుత్రుడు’చిత్రం వచ్చింది. ఇప్పుడీ ‘కార్తికేయ -2’లోనూ అదే అంశాన్ని మరింత విభిన్నంగా దర్శకుడు చందు మొండేటి చూపించబోతున్నారని తెలుస్తోంది. జూలై 22న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఆగస్ట్ మొదటి వారానికి వాయిదా వేశారు.