తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయిన లక్ష్మీ రాయ్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. కెరీర్ ఆరంభంలో సంప్రదాయమైన పాత్రలతో డీసెంట్‌గా కనిపించిన ఈ అమ్మడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచేసి ప్రత్యేక గీతాల్లో తళుక్కుమంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెం 150 సినిమాలో రత్తాలు రత్తాలు అంటూ కుర్ర కారు చేత మాస్ స్టెప్స్ వేయించేలా ఐటెం భామగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న ‘అఖండ’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అలరించనుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ బాలయ్య-లక్ష్మీ రాయ్ లతో ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారని సమాచారం. కాగా ఇదివరకే వీరిద్దరూ ‘అధినాయకుడు’ సినిమాలో కలిసి నటించారు. ‘అఖండ’లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.