మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 23న విజయవాడలో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వినిపిస్తోంది. అయితే, ఆ రోజున చిరంజీవి, రామ్ చరణ్ కలసి ముఖ్యమంత్రిని కలుసుకొనే అవకాశముందని, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం డైనమిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఛీఫ్ గెస్ట్ అని రూఢీగా తెలుస్తోంది.
‘ఆచార్య’ చిత్రంలోని పాటలు ఇప్పటికీ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తొలిసారి చిరంజీవి, రామ్ చరణ్ కలసి పూర్తి స్థాయిలో నటిస్తోన్న చిత్రంగా ‘ఆచార్య’ అభిమానుల్లో ఆనందం పెంచుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటి దాకా రూపొందిన అన్ని చిత్రాలు విజయపథంలో పయనించాయి. అదే రీతిన ఈ ‘ఆచార్య’ సైతం విజయతీరాలను చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో చిరంజీవికి అనేక మ్యూజికల్ హిట్స్ అందించిన మణిశర్మ ఈ సినిమాకు కూడా బాణీలు కట్టడం, ఆ పాటలు అలరిస్తూ ఉండడంతో సినిమాపై బజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాగనున్న ప్రీరిలీజ్ వేడుక అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచనుందని చెప్పవచ్చు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూ సూద్, జిష్పూ సేన్ గుప్తా, వెన్నెల కిశోర్, సౌరవ్ లోకేశ్, కిశోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, అజయ్, సంగీత, రెజీనా, నాజర్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది.