Aamir Khan Reacts On Boycott Laal Singh Chaddha Trend: ఓవైపు ఆమిర్ కాన్ తన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఆ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పీకేలో తమ శివుడ్ని హేళన చేశాడని, దేశంలో ఇంటోలరెన్స్ ఎక్కువగా ఉందన్నాడని, శివుడిపై పాలు పోయడం వృధా అని చెప్పాడంటూ.. గత వ్యవహారాల్ని సీన్‌లోకి తీసుకొచ్చి, ‘లాల్ సింగ్ చడ్డా’ని బహిష్కరించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే #BoyCottLaalSinghChaddha అనే హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ విషయం తనదాకా చేరడంతో.. ఆమిర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి తన సినిమాను బాయ్‌కాట్ చేయొద్దని వేడుకున్నాడు. ‘‘నా సినిమాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారం చూసి చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనసుల్లో గట్టిగా నాటుకుపోయినట్టు ఉంది. అందుకు నాకు విచారంగా ఉంది. నా దేశాన్ని నేను గౌరవించనని ఎవరైతే భావిస్తున్నారో, వాళ్లకు నేను చెప్పాల్సింది ఒక్కటే.. నాకు నా భారతదేశం అంటే ఎంత ప్రేమ ఉంది. నేను దేశాన్ని గౌరవించనని మీరు నమ్ముతున్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. నా గురించి అలాంటి ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమాను బహిష్కరించకండి, థియేటర్లకు వెళ్లి చూడండి’’ అంటూ ఆమిర్ ఖాదన్ ఆవేదనతో వేడుకున్నాడు.
కాగా.. ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తోన్న ‘లాల్ సింగ చడ్డా’ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో అతడు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు అద్వైత్ చంద్రన్ తెరకెక్కించాడు. గత చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ డిజాస్టర్ అవ్వడంతో, ఈ చిత్రంపై ఆమిర్ ఖాన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి, అందుకు తగినట్టుగా ఇది ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.