గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ దరల విషయమై రచ్చ నడుస్తోంది. మరోవైపు థియేటర్ల సీజ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా థియేటర్ యాజమాన్యాలకు ఊరటనిస్తూ థియేటర్ల రీఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కండిషన్స్ మాత్రం అప్లై అని చెప్పడం గమనార్హం. కొన్ని రోజులుగా ఆంధ్రా థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. థియేటర్లను నిర్వహించడానికి అనుమతులతో పాటు అవసరమైన పత్రాలు, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సరిగ్గా లేని థియేటర్లను ఆయా ప్రాంతాల్లోని జాయింట్ కలెక్టర్లు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తక్కువ టికెట్ రేట్లతో సతమతమవుతున్న థియేటర్ యాజమాన్యాలకు ఇది మరో సమస్యగా పరిణమించింది. దాదాపు 100 థియేటర్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయగా… మరికొంత మంది స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు.
తాజాగా ఏపీలో థియేటర్లకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ బిగ్ స్క్రీన్‌లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నెల రోజుల్లో థియేటర్లు మూతపడడానికి కారణమైన అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం కండిషన్ పెట్టి ట్విస్ట్ ఇచ్చింది. అయితే థియేటర్ల యజమానులు తమ స్క్రీన్‌లను తిరిగి తెరవాలంటే ముందు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తులు సమర్పించాలి. అలాగే ఇప్పటి వరకూ ఉన్న ఫైన్ ను కూడా కట్టాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎగ్జిబిషన్ రంగానికి ఇది కొంతలో కొంత ఉపశమనం కలిగించే విషయమే !