#90s: ఓటిటీ వచ్చాకా కుటుంబం మొత్తం కలిసి ఇంట్లోనే సిరీస్ లు , సినిమాలు చూస్తున్నారు అని చెప్పుకొస్తున్నాం. కానీ ఎన్ని సిరీస్ లు, ఎన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తున్నాం. రొమాన్స్, వైలెన్స్ లేని సినిమాలు, సిరీస్ లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇంట్లో అందరం కలిసి కూర్చొని నవ్వుకున్న సినిమాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అయితే ఈ వారం అసలు సిసలైన కుటుంబ కథా చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ జనరేషన్ లో లేని ఆటలు, పాటలు, మిడిల్ క్లాస్ ముచ్చట్లు అన్ని అందులో చూడొచ్చు. అదే #90s. మిడిల్ క్లాస్ బయోపిక్. శివాజీ, వాసుకి, మౌళి, వసంతిక, రోహన్ ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ జనవరి 5 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్ మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది. 90 ల్లో ఒక మిడిల్ క్లాస్ తండ్రి.. తన కుటుంబాన్ని, పిల్లలను ఎలా చూసుకున్నాడు అనేది కథగా చూపించారు.
లెక్కల మాస్టర్ చంద్రశేఖర్( శివాజీ), రాణి(వాసుకి) భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. ఎంత గవర్నమెంట్ ఉపాద్యాయుడు అయినా కూడా తన తాహత్తుకు మించి ముగ్గురు పిల్లలను ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తాడు. ఇక ఇద్దరు పిల్లలు బాగానే చదువుతారు కానీ, మూడోవాడు పరమశుంఠ. చదువు విషయం ఎలా ఉన్నా.. కుటుంబం, బాధ్యతలు, ఆప్యాయతలు, అనురాగాలు, తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ.. వీటన్నింటిని చూపించి ప్రతి ఒక్కరి గుండెను పిండేశాడు దర్శకుడు. ఈ కాలం జనరేషన్ కు ఈ సిరీస్ ఒకప్పుడు తమ తల్లిదండ్రులు ఎలా పెరిగారు.. ఎలా చదువుకున్నారు అని చూపిస్తుంది. రాత్రి అయితే.. కుటుంబం మొత్తం కలిసి తినడం, అమృతం చూడడం, చిరంజీవి సినిమా వస్తే నాన్న నిద్రపోకుండా చూడడం, పొద్దునే అమ్మ ఉప్మా చేస్తే తిట్టుకోవడం.. బంధువులు ఇంటికి వస్తే డబ్బులు ఇస్తారని ఎదురుచూడడం, స్కూల్ లో మొదటి ప్రేమ, స్నేహితులు.. ఇలా ఎన్నో మధురమైన అనుభావాలను ఈ సిరీస్ చూపించింది.
ఇక ఇందులో నటించిన వారందరూ.. నటించలేదు.. జీవించారు. మిడిల్ క్లాస్ తండ్రిగా, లెక్కల మాస్టర్ గా శివాజీ, భర్త తెచ్చిన జీతం తోనే కుటుంబాన్ని గడిపే భార్యగా, కూతురును ఎంతో భయంగా పెంచే తల్లిగా వాసుకీ ప్రాణం పెట్టేశారు పాత్రల్లో. ఇక పిల్లల విషయంలో రోహన్.. మొత్తం క్రెడిట్ ను లాగేసుకున్నాడు. ఆదిత్యగా అతని నటన వేరే లెవెల్. అందులో తమల్ని తాము చేసుకున్నామని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ సూపర్ హిట్ సిరీస్ గా నిలిచింది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ ఎన్నాళ్లయిందిరా.. కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి ఒక సిరీస్ చూసి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.