Daasi: అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ‘సంసారం’ చిత్రం నిర్మించిన వారిలో ఒకరైన సి.వి.రంగనాథ దాస్ తరువాత తానే మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘దాసి’. ఈ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించారు. ‘సంసారం’లో జంటగా నటించిన యన్టీఆర్, లక్ష్మీరాజ్యం ఇందులోనూ జోడీ కట్టారు. ఈ చిత్రం లక్ష్మీరాజ్యం సమర్పణలోనే ఆమె భర్త సి.శ్రీధరరావు నిర్మించడం విశేషం! 1952 నవంబర్ 26న విడుదలైన ‘దాసి’ ఆ యేడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది.
రామయ్య గుర్రపు బండి నడుపుతూ ఉంటాడు. అతని భార్య లక్ష్మి షావుకారు బద్రీనాథ్ ఇంట్లో పనిమనిషిగా ఉంటుంది. వారికి సుబ్బడు అనే అబ్బాయి ఉంటాడు. పిల్లలు లేని బద్రీనాథ్ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలను కుంటాడు. ఆయన భార్య పార్వతమ్మ ఆవేదన చెందుతుంది. ఆమె అన్న రామారావు సలహాతో నెలతప్పినట్టు పార్వతమ్మ నటిస్తుంది. అదే సమయంలో లక్ష్మి మళ్ళీ గర్భవతి అవుతుంది. లక్ష్మిని అనుమానించి, రామయ్య వదిలేస్తాడు. ఇంట్లోంచి బయటపడ్డ లక్ష్మిని పార్వతమ్మ చేరదీస్తుంది. లక్ష్మిఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. పార్వతమ్మ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి, తన కూతురుగా పెంచుతూ ఉంటుంది. రామయ్య దుర్గి అనే ఆమెను పెళ్ళాడుతాడు. దుర్గి సవతి కొడుకైన సుబ్బడిని ఏట్లో తోసేసి, వేరేవాడితో లేచిపోతుంది. సుబ్బడు పడ్డ ఏట్లోనే చావాలని ప్రయత్నిస్తుంది లక్ష్మి. కొడుకును గుర్తించి, అతని కోసం జీవించాలని ఆశిస్తుంది. రామయ్య బైరాగుల్లో కలసి పోతాడు. కాలం గిర్రున తిరుగుతుంది. సుబ్బడు కాస్తా సుబ్బారావు అవుతాడు. లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. పార్వతమ్మ దగ్గర పెరిగిన లక్ష్మి కూతురు కమల పెరిగి పెద్దవుతుంది. ఆమెను రామారావు కొడుకు ప్రేమ్ నాథ్ ఇష్టపడతాడు. అయితే కమల ఓ పనిచేసుకొనే ఆవిడ కూతురన్న సత్యం రామారావు భార్యకు కూడా తెలుసు. అందువల్ల ఆమె ప్రేమ్ నాథ్, కమలను పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఉండదు. రామారావు తన చెల్లికోసం త్యాగం చేసిన లక్ష్మిని చేరదీస్తాడు. ఆమె వారి ఇంట్లోనే ఉంటూ పనిచేస్తుంటుంది. కమలకు అసలు లక్ష్మి అంటేనే గిట్టకుండా ఉంటుంది. దాసి అని చాలా చులకనగా చూస్తూ ఉంటుంది. ఓ సారి ఏదో మంచి చెప్పబోతే, చెప్పుతో కొట్టబోతుంది. అదే సమయంలో పార్వతమ్మ వచ్చి అడ్డు పడుతుంది. అలాగే ప్రేమ్ నాథ్ తన మిత్రుడు అంటూ సుబ్బారావును పరిచయం చేస్తే అతను దాసి కొడుకు అని చాలా హేళన చేస్తుంది కమల. సుబ్బారావు తన తల్లిని ఆ ఇంట్లో పనిమానేయమని బ్రతిమలాడతాడు. అదే సమయంలో రామయ్య రెండో పెళ్ళి చేసుకున్న దుర్గి ఒకడితో కులుకుతూనే, మరొకడితో సరసం సాగిస్తూ ఉంటుంది. బైరాగిలా ఉన్న రామయ్య వాడిని హెచ్చరిస్తాడు. దుర్గి వేరేవాడితో ఉండడం చూసిన దాన్ని లేవదీసుకు వెళ్ళినవాడు పగబడతాడు. బైరాగి అయిన రామయ్య, దుర్గిని చూడటానికి వెళతాడు. అప్పటికే ఆమెను లేవదీసుకు పోయినవాడు చంపేసి ఉంటాడు. దుర్గి చచ్చిందని ఏడుస్తూ ఉంటే, హత్య చేశారని పోలీసులను పిలుస్తారు. అతనే ఖూనీ చేశాడని పోలీసులు పట్టుకు పోతారు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు రామయ్య తరపున సుబ్బారావు వాదించి, గెలుస్తాడు. అసలు దోషిని పోలీసులు పట్టుకుంటారు. సుబ్బారావు వెంటే రామయ్య వెళతాడు. అక్కడకు వెళ్ళాక అన్ని విషయాలూ తెలుస్తాయి. చివరకు తాను హేళన చేసిన ఆమె తన కన్నతల్లి అని, సుబ్బారావు తన అన్న అని తెలుసుకుంటుంది కమల. అందరూ కలుసుకోవడం, ప్రేమ్ నాథ్, కమల పెళ్ళి జరగడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో రామయ్యగా యన్.టి.రామారావు, లక్ష్మిగా లక్ష్మీరాజ్యం నటించారు. మిగిలిన పాత్రల్లో యస్.వి.రంగారావు, రేలంగి, శివరావు, చలం, దొరస్వామి, శ్రీవత్స, శాంతకుమారి, వసంత, కనకం, సూర్యకాంతం, బెజవాడ కాంతమ్మ, హేమలతమ్మారావ్, ఇందిర ఆచార్య, సీత, బేబీ దమయంతి నటించారు. ఈ చిత్రానికి వి.సదాశివబ్రహ్మం కథ, మాటలు సమకూర్చగా, ఆత్రేయ పాటలు పలికించారు. ఈ సినిమాకు సి.ఆర్.సుబ్బరామన్, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. “మారాజుల చాకిరి చేసి దొరసాని..”, “జోర్సే చల్ నా రాజా..”, “చిట్టి తల్లి నవ్వవే..”, “ఏడవకమ్మా ఏడవకు..”, “కొత్త కాపురం..”, “వయసు సొగసు యువరాణి..”, “నా చిన్నారి బావా..” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రంలో యన్టీఆర్ ఊతపదంగా, “ఆరి నీ తల్లి సిగ కొయ్య..” అని వినిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఆ రోజుల్లో భలే పాపులర్ అయింది.
అదే యేడాది ‘పెళ్ళిచేసిచూడు’తో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన యన్టీఆర్, ఇందులో పూర్తి భిన్నమైన పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక దాసిగా లక్ష్మీరాజ్యం నటన సైతం ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి, శతదినోత్సవాలు, రజతోత్సవం చూసింది. ఈ సినిమా సక్సెస్ తో నిర్మాత శ్రీధరరావు దీనిని తమిళంలో ‘వేలైకారి మగల్’ పేరుతో రీమేక్ చేయగా, అందులోనూ యన్టీఆర్, లక్ష్మీరాజ్యం తదితరులు నటించారు. అక్కడ కూడా ఈ కథ విజయం సాధించింది.