వర్ధమాన కథానాయకునిగా చిరంజీవి సాగుతున్న రోజులవి. దర్శకునిగా కోడి రామకృష్ణ తొలి ప్రయత్నం కోసం తపిస్తున్న సమయమది. వారిద్దరి కాంబినేషన్ లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంతో చిరంజీవి తొలిసారి తన నటజీవితంలో స్వర్ణోత్సవం చూశారు. మొదటి సినిమాతోనే ‘గోల్డెన్ జూబ్లీ’ పట్టేసిన కోడి రామకృష్ణ ఆ తరువాత మరికొన్ని స్వర్ణోత్సవాలతో ‘గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్’ అనిపించుకున్నారు. ఈ సినిమాతోనే ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు నటునిగా పరిచయమై, తరువాత వందలాది చిత్రాల్లో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇన్నివిశేషాలకు కారణమైన ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ చిత్రం 1982 ఏప్రిల్ 23న విడుదలయింది.
ఇంతకూ ఈ సినిమా కథ ఏమిటంటే- సరైన వసతులు లేక బురదలోనే నివసించే ఓ ఊరి జనానికి రోడ్లు వేయించడానికి సివిల్ ఇంజనీర్ రాజశేఖరం వస్తాడు. ఓ ఇంట్లో వసతి ఏర్పాటు చేస్తారు. ఆ ఇంటి యజమాని కూతరు జయలక్ష్మి, రాజశేఖరం ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. ఆ ఊరిలో చిట్టితల్లి అనే ఓ అల్లరి పిల్ల ఉంటుంది. ఆమెకు రాజశేఖరంతో చనువు ఉంటుంది. తరువాత రాజశేఖరం భార్య జయలక్ష్మిని తీసుకొని పట్నం వెళతాడు. అక్కడ వారి పక్కింట్లో సుబ్బారావు అనేవాడు ఉంటాడు. అతను కనిపించిన అమ్మాయినల్లా అనుభవించాలనే దుర్బుద్ధి కలవాడు. బయటికి మాత్రం ఎంతో వినయంగా నటిస్తూ ఉంటాడు. అతను జయలక్ష్మిపై కన్నువేస్తాడు. చిట్టితల్లి ఓ మోసగాణ్ణి నమ్మి చావాలనుకుంటుంది. ఆమెను రాజశేఖరం చేరదీస్తాడు. దాంతో జయలక్ష్మిలో అనుమానాలు పెరుగుతాయి. భర్తతో పోట్లాటాలు మొదలవుతాయి. జయలక్ష్మికి చిట్టితల్లి ఎంత నచ్చచెప్పినా వినదు. చిట్టితల్లి చనిపోతుంది. రాజశేఖరం, జయలక్ష్మి మధ్య దూరం పెరుగుతుంది. దానిని అవకాశంగా తీసుకొని సుబ్బారావు, మెల్లగా జయలక్ష్మిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఓ నాటకమాడి ఆమెను తన గెస్ట్ హౌస్ పిలిపించుకుంటాడు సుబ్బారావు. అతని నిజస్వరూపం చూసిన జయలక్ష్మి నివ్వెర పోతుంది. అప్పుడే రాజశేఖరం వచ్చి, సుబ్బారావుకు రెండు పీకి బుద్ధి చెబుతాడు. సుబ్బారావు భార్య సీత కూడా వచ్చి, భర్తను అసహ్యించుకుంటుంది. కాళ్ళపై పడి క్షమించమంటాడు. అలాంటి వాణ్ణి క్షమించరాదు అంటుంది జయలక్ష్మి. అప్పుడు ‘రాక్షసుడిలాంటి వాడితో నేను కాపురం చేస్తున్నాను. కానీ, దేవుడులాంటి భర్తను నువ్వు అనుమానించి అవమానిస్తున్నావు. కాబట్టి, నీకు మాట్లాడే హక్కు లేదు’ అంటుంది. నాటి సీత మొదలు ఈ సీత దాకా ఆడది ఆడదే అని చెబుతుంది. దాంతో కనువిప్పు కలిగిన జయలక్ష్మి, భర్తను క్షమించమంటుంది. వారిద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో చిరంజీవి, మాధవి, గొల్లపూడి, సంగీత, పూర్ణిమ, అన్నపూర్ణ, పి.యల్. నారాయణ, భీమేశ్వరరావు, గాదిరాజు సుబ్బారావు, హనుమాన్ రెడ్డి, కాకినాడ శ్యామల, విజయలక్ష్మి, జయశీల, గిరిజారాణి నటించగా, అతిథి పాత్రల్లో సి.యస్.రావు, చక్రపాణి, రూపాచక్రవర్తి కనిపించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కోడి రామకృష్ణ సమకూర్చగా, గొల్లపూడి మాటలు పలికించారు. జె.వి.రాఘవులు సంగీతం రూపొందించగా, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. “ఒక వనితా…నవ ముదితా…”, “వచ్చే వచ్చే వాన జల్లు…”, “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యా…”, “స్వామియే శరణం అయ్యప్పా…”, “సీతారాముల ఆదర్శం…”, “పలికేది వేదమంత్రం…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
కోడి రామకృష్ణ గురువు దాసరి నారాయణరావుకు దర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కె.రాఘవనే. ఆయనే కోడిని కూడా దర్శకునిగా పరిచయం చేయడం విశేషం! కోడి రామకృష్ణకు దర్శకునిగా ఇది తొలి సినిమా కావడంతో మొదట్లోనే తన పేరును ప్రకటించుకోవడం, నేపథ్యంలో వేదమంత్రోచ్చరణ సాగుతూ ఉండడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో క్రిష్ణయ్య’ చిత్రంలో పూర్ణిమకు కూడా మంచి పేరు లభించింది. ఆ తరువాత ఆమె పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు 2 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమయింది. కాగా హైదరాబాద్ శాంతిలో రోజూ 3 ఆటలతో 106 రోజులు నడిచింది. తరువాత నాంపల్లి – లత లో ఉదయం ఆటలతో -52 రోజులు చూసింది. ఆ పై షిఫ్ట్ లతో ఉదయం ఆటలు ఆడుతూ 517 రోజులు పూర్తి చేసుకుంది. అంతకు ముందు సంవత్సరమే విడుదలైన దాసరి నారాయణరావు ‘ప్రేమాభిషేకం’ 525 రోజులు ప్రదర్శితమయింది. దాంతో అప్పట్లో 500 రోజులకు క్రేజ్ ఉండేది. ఓ చిన్న సినిమాగా వచ్చిన ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ కూడా 517 రోజులు ఆడడంతో అందరూ హీరో చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణపై ప్రత్యేక దృష్టి సారించేలా చేసింది. ఈ సినిమా తరువాత కోడి రామకృష్ణ ‘మంగమ్మగారి మనవడు’ ఏకంగా మూడు ఆటలతో 560 రోజులు ప్రదర్శితమై నేటికీ రన్ విషయంలో తెలుగు చిత్రాల్లో ఓ రికార్డుగా నిలచే ఉంది.
ఇక చిరంజీవి, మాధవి జంటగా అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు రూపొందాయి. ఈ సినిమా హైదరాబాద్ శాంతిలో వందరోజులు పూర్తి చేసుకొని షిఫ్టులతో స్వర్ణోత్సవం చూసింది. తరువాత అదే థియేటర్ లో చిరంజీవి, మాధవి నటించిన ‘ఖైదీ’ కూడా శతదినోత్సవం చూసి, ఉదయం ఆటలతో స్వర్ణోత్సవం జరుపుకోవడం విశేషం!