Station Master: ఆ రోజుల్లో దర్శకుడు కోడి రామకృష్ణ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం అటు నిర్మాతల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. కోడి రామకృష్ణ రూపొందించిన చిత్రానికి వెళ్తే, టిక్కెట్ రేటుకు సరిపడా వినోదం ఖాయమని భావించి, ఆయన సినిమాలకు పరుగులు తీసేవారు జనం. ఆయన తెరకెక్కించిన చిత్రాల ద్వారానే అప్పటికి చిరంజీవి, బాలకృష్ణ స్టార్ డమ్ సంపాదించడం గమనార్హం! ఈ నేపథ్యంలోనే జనాల్లో కోడి రామకృష్ణకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. వర్ధమాన కథానాయకునిగా డాక్టర్ రాజశేఖర్ సాగుతున్న రోజుల్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన “తలంబ్రాలు, ఆహుతి” వంటి చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఆ తరువాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో రాజశేఖర్ నటించిన చిత్రంగా ‘స్టేషన్ మాస్టర్’ 1988 మార్చి 2వ తేదీన విడుదలయింది. ఇందులో మరో హీరోగా రాజేంద్రప్రసాద్ నటించారు. నటవిరాట్ రావు గోపాలరావు ఈ చిత్రాన్ని సమర్పించడమే కాకుండా, ఇందులో ‘స్టేషన్ మాస్టర్’ పాత్రను పోషించారు.
రామారావు, చైతన్య అనే ఇద్దరు మిత్రులు చదువుకున్నా, సరైన ఉద్యోగం లేక తిరుగుతూ ఉంటారు. వారికి ఓ చిన్న ఊరిలోని స్టేషన్ మాస్టర్ పరిచయం అవుతారు. ఆయనకు పిల్లలు ఉండరు. ఆయన భార్య లక్ష్మి సైతం రామారావు, చైతన్యను కన్నబిడ్డల్లా ఆదరిస్తుంది. రామారావు, చైతన్యకు పుష్ప, రాణీ అనే అమ్మాయిలు పరిచయం అవుతారు. వారిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. అయితే పుష్ప, రాణి ఇద్దరూ విభిన్నమైన మనస్తత్వాలు కలవారు. దాంతో వారి కాపురాల్లో కలహాలు మొదలవుతాయి. వాటిని అధిగమించేలా చేసి, వారిని ఓ దారిలో పెట్టడానికి స్టేషన్ మాస్టర్ ఎలాంటి పని చేశారు అన్నదే మిగతా కథ. కథ పాతదే- అయితే కథనంతో ఆకట్టుకొనేలా తీర్చిదిద్దారు కోడి రామకృష్ణ.
జీవిత, అశ్విని నాయికలుగా నటించిన ఈ చిత్రంలో అన్నపూర్ణ, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, మల్లికార్జున ర ఆవు, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.ఆర్.వరలక్ష్మి, అనిత, చంద్రిక, వై.విజయ ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా, డాక్టర్ సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల పాటలు రాశారు. ఇందులోని “గ్యాంగోళ్ళమండి బాబో…”, “సయ్యాటకి..”, “పరుగులు తీసే…”, “ఉడుకు ఉడుకు ముద్దు…”, “ఎక్కడికో ఈ పయనం…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. రావు గోపాలరావు సమర్పణలో జయరామారావు నిర్వహణతో ఎస్.అంబరీశ్ నిర్మించిన ‘స్టేషన్ మాస్టర్’ మంచి విజయం సాధించింది.