తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది. ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ రెండు చిత్రాలలోనూ విజయశాంతి నాయికగా నటించడం విశేషం!
‘రౌడీ ఇన్ స్పెక్టర్’ కథ ఏమిటంటే – ఇన్ స్పెక్టర్ రామరాజు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎంతటి రౌడీనైనా ఇట్టే కటకటాల్లోకి నెట్టగల సత్తా ఆయన సొంతం. ఖాకీ డ్రెస్ విప్పేస్తే నేను మీ కంటే పెద్ద రౌడీనిరా అంటూ రౌడీలకే సవాల్ విసిరేంతటి తెగువ రామరాజుకు ఉంటుంది. అందుకే జనం ఆయనను ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ అంటూ ఉంటారు. ఆటో నడిపే రాణికి, రామరాజు అంటే ఎంతో అభిమానం. వారిద్దరూ ప్రేమించుకుంటారు. హోమ్ మినిస్టర్ కాశయ్య, ఎస్.పి. రాజు అండతో బొబ్బర్లంక రామబ్రహ్మం అనే రౌడీ విర్రవీగుతుంటాడు. వాడి తమ్ముడు నరసింహం, అనుచరుడు రాకీని ఓ లేడీ కానిస్టేబుల్ ను చంపిన కేసులో అరెస్ట్ చేస్తాడు రామరాజు. వాళ్ళిద్దరూ తప్పించుకొనే ప్లాన్ వేస్తాడు రామబ్రహ్మం. తప్పించుకొని పారిపోతూ ఉండగా, రాకీని కాల్చబోతాడు రామరాజు. అయితే వాడు తప్పించుకోవడం వల్ల ఆ బుల్లెట్ వెళ్ళి కాలేజ్ లెక్చరర్ కు తగిలి మరణిస్తాడు. రామరాజునే తన కొడుకును పొట్టనపెట్టుకున్నాడని లెక్చరర్ తల్లి, ఆయన కుటుంబసభ్యులు భావిస్తారు. ఆ కుటుంబానికి రామరాజు చేతనైన మేలు చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళు రామరాజును హంతకునిగానే చూస్తూంటారు. డిఐజీ జగన్నాథరావు కొడుకుతో లెక్చరర్ చెల్లెలి పెళ్ళి కుదిరేలా చేస్తాడు రామరాజు. డి.ఐ.జి. జగన్నాథరావును రామబ్రహ్మం చంపేసి కోర్టులో రామరాజు చంపాడని చెబుతాడు. రామరాజును కోర్టు దోషిగా నిర్ణయిస్తుంది. రామబ్రహ్మం జగన్నాథరావును చంపడంపై గాంధీ అనే వ్యక్తి ఆధారాలు సేకరించి ఉంటాడు. ఆధారాలతో రాణి అతణ్ణి రక్షించి, కోర్టుకు హాజరు పరుస్తుంది. కోర్టులో హోమ్ మినిస్టర్ ని కూడా రామబ్రహ్మం చంపుతాడు. రామబ్రహ్మంను, కోటిని చితకబాది రామరాజు దోషులుగా చట్టం ముందు నిలుపుతాడు. జడ్జి సైతం రామరాజును అభినందించడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో రామరాజుగా బాలకృష్ణ, రాణిగా విజయశాంతి నటించారు. మిగిలిన పాత్రల్లో కోట శ్రీనివాసరావు, జగ్గయ్య, కెప్టెన్ రాజు, మోహన్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, నూతన్ ప్రసాద్, సాయికుమార్, శ్రీహరి, విజయరంగరాజు, అన్నపూర్ణ, కిన్నెర, పాకీజా, హేమ, నిర్మలమ్మ అభినయించారు.
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రానికి ఆంజనేయ పుష్పానంద్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చగా, పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. బప్పిలహిరి బాణీలకు భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “డిక్కీ డిక్కీ ఢీ డిక్కీ…”, “అరె యో సాంబా… ఆయారే రాంబో…”, “టక్కుటమారం బండి…”, “చిటపట చినుకులు తనువులు తడిపే వానలో…”, “నీలాల నింగి…”, “ఓ పాపాయో… ఆయో ఆయో…” అంటూ మొదలయ్యే పాటలు అలరించాయి. “టక్కుటమారం బండి..” పాటలో ఊళ్ళ పేర్లతో పాట సాగడం విశేషం! ‘అరె యో సాంబా…’ పాటను ఈ మధ్య నందమూరి కళ్యాణ్ రామ్ తన ‘పటాస్’ చిత్రంలో రీమిక్స్ చేసి తన బాబాయ్ బాలయ్యకు ట్రిబ్యూట్ ఇవ్వడం మరింత విశేషం!
‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమా వసూళ్ళను చూసి, దీనికంటే ముందుగా వచ్చిన కొన్ని చిత్రాలు తమ లెక్కలను సరిచేసుకొని, అప్పుడు అంత కాదు ఇంత అంటూ ప్రకటించుకోవలసి వచ్చింది. అంటే ఏ రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో 60 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకొని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందీ చిత్రం. 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇదే పేరుతో డబ్ చేశారు. ఇక తమిళంలో ఆ రోజుల్లో విజయశాంతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘ఆటో రాణి’గా అనువదించారు. ఈ తమిళ చిత్రంలో కామెడీ ట్రాక్ ను ప్రత్యేకంగా చిత్రీకరించారు. ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లోనూ రజతోత్సవం జరుపుకోవడం విశేషం!