గత యేడాది కరోనా టైమ్ లో వ్యూవర్స్ కు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను తన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ తో అందించింది చాయ్ బిస్కెట్ సంస్థ. అనురాగ్, శరత్ నిర్మాతలుగా పృథ్వీ వనమ్ రూపొందించిన ఈ వెబ్ సీరిస్ ఆరు ఎపిసోడ్స్ కూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్స్ ను యూ ట్యూబ్ లో ఓ ఫుల్ లెంగ్త్ మూవీగానూ రిలీజ్ చేశారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అందుకున్న ఈ వెబ్ సీరిస్ లో జంటగా నటించిన చైతన్య రావ్, అనన్య కు యూత్ లో సూపర్ క్రేజ్ వచ్చింది. దాంతో ఈ వెబ్ సీరిస్ సెకండ్ సీజన్ నూ మొదలు పెట్టేశారు. ఆ మధ్య విడుదల చేసిన ప్రోమోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ప్రేమికుల రోజున మొదటి ఎపిసోడ్ ను యూ ట్యూబ్ లో చాయ్ బిస్కెట్ సంస్థ అప్ లోడ్ చేసింది.
సూపర్ మార్కెట్ లో ఫస్ట్ యానివర్సరీ!
ఆరేడు నెలల క్రితం వచ్చిన సీజన్ వన్ లో ’30 వెడ్స్ 21’తో వచ్చే సమస్యలను చూపించారు. అయితే ఈ గ్యాప్ ను యేడాదిగా మార్చేశాడు డైరెక్టర్ పృధ్వీ వనమ్. సో… ఇప్పుడీ సెకండ్ సీజన్ పృథ్వీ అండ్ మేఘన (చైతన్య రావ్, అనన్య) ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీతో మొదలైంది. చిత్రం ఏమంటే… కరోనా కాలం నాటి భయాలు మాత్రం జనాలకు ఇంకా పోలేదు. వెడ్డింగ్ డే పొద్దునే లేచి ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుని, పనిలో పనిగా స్టోర్స్ కు బయలు దేరతారు. అయితే… వాళ్ళ మధ్యే ఆ స్టోర్స్ లో సరుకులు కొంటూ ఓ కుర్రాడు దగ్గి దగ్గీ ఢామ్మని పడిపోతాడు. వాడికి కరోనా రావడం వల్లే అలా జరిగిందేమోనని అందరిలో టెన్షన్! ఆ కుర్రాడి మెడికల్ రిపోర్ట్ వచ్చేంతవరకూ కస్టమర్స్ బయటకు వెళ్ళడానికి వీల్లేదంటాడు స్టోర్ మేనేజర్. దాంతో పృథ్వీ, మేఘన వెడ్డింగ్ డే సగం అక్కడే గడిచిపోతుంది. ఇదే సమయంలో తనకు లైఫ్ బోర్ కొడుతోందని, ఏదైనా జాబ్ లో చేరతానని కార్తీక్ భార్య జెస్సీతో చెబుతుంది మేఘన. ఆమె తన ఆఫీస్ లోనే కంటెంట్ రైటర్ పోస్ట్ ఉందని, తాను రికమండ్ చేస్తానని హామీ ఇస్తుంది. ఆ విషయం పృథ్వీకి చెప్పగానే తాను మేఘనకు బోర్ కొట్టేశానని ఊహించుకుని బాధపడతాడు. ఆ బాధను డైల్యూట్ చేస్తూ మేఘన… ఆ నైట్ వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ఓ సూపర్ ట్రీట్ ఇస్తుంది.
Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్
ఈ వెబ్ సీరిస్ లోని హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ తెలియ చెప్పేలా చక్కటి పాటతో సీజన్ 2 ను ప్రారంభించారు. దాంతో ఓ కూల్ బ్రీజ్ తో ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది. స్టోర్స్ లో చిత్రీకరించిన సన్నివేశాలలో కామెడీని మిక్స్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మేనేజర్ సారీ బాబు… సారీ.. సూరి బాబుగా నటించిన శివ చక్కటి వినోదాన్ని అందించాడు. ఇక కార్తీక్ గా నటించిన మహేందర్ తనదైన టైమింగ్ తో ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా పృథ్వీ, మేఘన జంట వినోదాల విందును తప్పకుండా అందిస్తుందనే ఆశాభావం ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే కలిగింది.
ఫస్ట్ డే ఎట్ ఆఫీస్!
తండ్రి భుజాల మీద నుండి లోకాన్ని చూడటం వేరే… మన కాళ్ళ మీద నిలబడి ప్రపంచాన్ని చూడటం వేరు. ఫస్ట్ డే స్కూల్ కు వెళ్ళినప్పుడు ఎలాంటి భయాందోళనలు, సంభ్రమం కలుగుతాయో… ఫస్ట్ డే ఆఫీస్ కు వెళ్ళినా అవే ఫీలింగ్స్! ’30 వెడ్స్ 21′ సీజన్ 2, సెకండ్ ఎపిసోడ్ లో దానినే దర్శకుడు పృథ్వీ చూపించాడు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న పృథ్వీకి వండి వడ్డించడంతో బోర్ ఫీలయిన మేఘన ఏదో ఒక జాబ్ చేయాలని భావిస్తుంది. చిత్రం ఏమంటే… ఆమె ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్ళాలని అనుకుంటుంది కానీ… పృథ్వీకి మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తూనే ఉంటుంది. జెస్సీ ఇచ్చిన మాట ప్రకారం తన ఆఫీస్ లోనే మేఘనకు స్క్రిప్ట్ రైటర్ గా ఇంటర్న్ షిప్ ఇప్పిస్తుంది. ఫస్ట్ డే మేఘన ఆఫీస్ లో జరిగిన ఫన్ ఎలిమెంట్సే ఈ సెకండ్ ఎపిసోడ్. పొరపాటుగా జరిగిన సంఘటనలకు మేఘన బలికావడం, ముక్కుమీద కోపం పెట్టుకునే బాస్, మంచి స్క్రిప్ట్ తో ఆ తర్వాత ఆమె అనుగ్రహం పొందడం… మొత్తం మీద ఓ చక్కని స్క్రిప్ట్ వర్క్ కు మేఘన సాయం చేసి, షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ పొందడంతో ఈ సెకండ్ ఎపిసోడ్ కూల్ గా సాగిపోయింది.
ఉద్యోగం చేసే భార్యను ఎలా చూసుకోవాలి, వాళ్ళ మూడ్ కు తగ్గట్టు ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను పృథ్వీ ద్వారా దర్శకుడు చూపించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో… ఎలా తగ్గాలో కూడా చెప్పాడు. పానీ పూరీ పోటీలో కావాలని ఓడిపోవడం, ఆ తర్వాత ఆ విషయాన్ని అంగీకరించడం, తండ్రి గుర్తుకు వచ్చిన మేఘనను ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవడం వంటి సున్నితమైన అంశాలతో ఈ ఎపిసోడ్ సాగింది. కాఫీ కోరిక తీరకుండానే పృథ్వీ ఇంటి నుండి కార్తీక్ వాకౌట్ చేయడం వంటివి ఫన్ ను జనరేట్ చేశాయి. మొత్తం మీద మేఘన తన కొత్త ఉద్యోగాన్ని ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలనే ఆసక్తిని వ్యూవర్స్ లో ఈ ఎపిసోడ్ కలిగించింది. మూర్తి గారు (వీరభద్రం) జానకమ్మ (శ్రీకుమారి)తో పాటు నిదానంగా కొత్త పాత్రలూ పరిచయం కావడం మొదలైంది.
ఇక ఎప్పటిలానే అసమర్థుడుతో పాటు మనోజ్ పోడూరి రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. జోస్ జిమ్మీ నేపథ్య సంగీతం, సాహిత్యం బాగున్నాయి. మంజిత్ పాల్ సౌండ్ మిక్సింగ్ సూపర్. ప్రత్యక్ష రాజు సినిమాటోగ్రఫీ కూడా చక్కని మూడ్ ను క్రియేట్ చేస్తోంది. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అనే ఉత్సుకతను ఈ ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ కలిగించాయి.