తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న మాట! థియేటర్లు రెండు నెలలు మూతపడ్డా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు రావడం అభినందనీయమే! అయితే వీటిలో కొన్ని నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. కానీ, విజయశాతం మాత్రం మునుపటిలా లేదన్నది నిర్వివాదాంశం!
తొలి విజయం ‘క్రాక్’!
తొలి నెల జనవరిలో స్ట్రెయిట్ మూవీస్ 21 రాగా, డబ్బింగ్ సినిమాలు ఐదు జనం ముందు వాలాయి. వెరసి 26 చిత్రాలు సందడి చేసే ప్రయత్నం చేశాయి. బిగినింగ్ లోనే బిగ్ హిట్ కొట్టాలని సినీజనం కోరుకుంటారు. అలాగే సామాన్య జనం అదిరిపోయే ఆనందం పొందాలనీ చూస్తారు. రెండిటికీ ఎప్పుడో కానీ లంకె కుదరదు. ఈ సారి పొంగల్ బరిలో గెలిచిన చిత్రం ‘క్రాక్’ అనే చెప్పాలి. రవితేజ, మలినేని గోపీచంద్ కాంబోలో వచ్చిన ‘క్రాక్’ కిర్రాకు పుట్టించింది. పొంగల్ బరిలోనే హంగామా చేసే ప్రయత్నం చేశాయి రామ్ పోతినేని ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’- ఈ రెండు సినిమాలు ఊరించి ఉసూరుమనిపించాయి. డబ్బింగ్ సినిమాల్లో విజయ్ ‘మాస్టర్’ పరవాలేదనిపించింది.
పేరుకు తగ్గ విజయం ‘ఉప్పెన’!
ఫిబ్రవరిలో స్ట్రెయిట్ మూవీస్ 23, డబ్బింగ్ సినిమాలు 5 వెరసి 28 చిత్రాలు జనం ముందు నిలిచాయి. ఓ నాటి బుల్లి నటుడు తేజ సజ్జా తొలిసారి హీరోగా నటించిన ‘జాంబిరెడ్డి’ పరవాలేదనిపించింది. ఆ తరువాతి వారం వచ్చిన ‘ఉప్పెన’ టైటిల్ కు తగ్గట్టే ఉవ్వెత్తున ఎగసింది. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలిసారి హీరోగా నటించిన ‘ఉప్పెన’తోనే సాలిడ్ హిట్ పట్టేశాడు.
ఫిబ్రవరిలోనే సుమంత్ ‘కపటధారి’ కనికట్టు చేయలేక పోయింది. నితిన్ ‘చెక్’ నిరాశ పరచింది. ఉదయ్ శంకర్ ‘క్షణ క్షణం’ అంత ఉత్కంఠ కలిగించలేకపోయింది. అలీ ‘లాయర్ విశ్వనాథ్’గా అలరించలేక పోయాడు. నందినీ రెడ్డి రూపొందించిన ‘పిట్ట కథలు’ ఆకట్టుకోలేకపోయాయి. అల్లరి నరేశ్ తన ఇమేజ్ కు భిన్నంగా నటించిన ‘నాంది’ జనం మనసులు గెలుచుకుంది.
‘జాతి రత్నాలు’ జయకేతనం!
మార్చి నెలలో 22 స్ట్రెయిట్ మూవీస్ పలకరించగా, నాలుగు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. మొత్తం 26 చిత్రాలలో ఊరించినవి చాలా ఉన్నాయి. సందీప్ కిషన్ ‘ఎ – వన్ ఎక్స్ ప్రెస్’, ‘పరమానందయ్య శిష్యుల కథ’ యానిమేషన్ మూవీ, తారకరత్న నటించిన ‘దేవినేని’ బయోపిక్, శర్వానంద్ ‘శ్రీకారం’, శ్రీవిష్ణు ‘గాలి సంపత్’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, నితిన్ ‘రంగ్ దే’, రానా ‘అరణ్య’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, కీరవాణి కొడుకు శ్రీసింహ ‘తెల్లవారితే గురువారం’ కాసింత హోప్స్ చూపాయి. అయితే అంతగా అలరించలేకపోయాయి. డబ్బింగ్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్’ పరవాలేదనిపించింది. మార్చిలో విజేతగా నవీన్ పోలిశెట్టి ‘జాతి రత్నాలు’ నిలచింది. ఆ సినిమా స్థాయిని మించి వసూళ్ళ వర్షం కురిసిందనే చెప్పాలి.
‘వకీల్ సాబ్’ సందడి!
కరోనా మళ్ళీ విజృంభిస్తోంది అనే మాట జనాల్లో వణుకు పుట్టించింది… లాక్ డౌన్ తప్పదు అన్న హెచ్చరికలు వస్తూ ఉండగానే , అయోమయం నెలకొంది. ఆ సమయంలో టాప్ హీరో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ జనం ముందు నిలచింది. కానీ ప్రేక్షకుల మదిని గెలవలేక పోయింది. ఏప్రిల్ లో 12 స్ట్రెయిట్ మూవీస్ రాగా, ఆరు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.. మొత్తం 18 చిత్రాలతోనే సర్దుకోవలసి వచ్చింది… నిరాశ కొట్టుమిట్టాడే సమయంలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయింది. అభిమానులకు ఆనందం పంచింది.ప్రేక్షకులనూ ఆకట్టుకోగలిగింది.
థియేటర్ల మూత – వినోదానికి కోత!
మే నెలలో లాక్ డౌన్ తప్పలేదు.దాంతో థియేటర్ల మూత – వినోదం కోత. ఆ సమయంలో రెండు స్ట్రెయిట్, ఒక డబ్బింగ్ వెరసి మూడు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వాటిలో అనసూయ ముఖ్యపాత్ర ధరించిన ‘థ్యాంక్యూ బ్రదర్’, సంతోష్ శోభన్, సీనియర్ నరేశ్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఉన్నాయి. డబ్బింగ్ మూవీ ‘అనుకోని అతిథి’ వచ్చింది.
మేలో మొదలైన లాక్ డౌన్ జూన్ అంతటా కొనసాగింది. దాంతో జూన్ లో కూడా రెండు స్ట్రెయిట్ మూవీస్, మూడు డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో పలకరించాయి. జూలైలో ఏడు స్ట్రెయిట్ సినిమాలు రాగా, వాటిలో రెండు ఓటీటీలో వచ్చాయి. టాప్ హీరో వెంకటేశ్ ‘నారప్ప’, రవిబాబు తెరకెక్కించిన ‘క్రష్’ ఓటీటీ బాట పట్టాయి.’నారప్ప’ జనాన్ని మెప్పించాడనే చెప్పాలి. జూలైలోనే జనాన్ని పలకరించిన సత్యదేవ్ ‘తిమ్మరుసు’ పరవాలేదనే టాక్ సంపాదించింది. ఇష్క్, నరసింహపురం, పరుగెత్తు పరుగెత్తు, త్రయం’ మురిపించలేకపోయాయి. అనువాదాల్లో మమ్ముట్టి ‘వన్’ కాసింత అలరించింది.
ఆగస్టు మాసం మళ్ళీ థియేటర్లను మురిపించింది. ఈ నెలలో నేరుగా తెలుగులో 24 చిత్రాలు రాగా, ఆరు అనువాదాలు పలకరించాయి. మొత్తం 30 సినిమాలతో ఆగస్టు భలేగా అలరించింది. ఆగస్టు 4న వచ్చిన ఆరు చిత్రాలలో ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ ఆకట్టుకుంది.
ఆగస్టులో వచ్చిన ఆర్.నారాయణ మూర్తి ‘రైతన్న’, విశ్వక్సేన ‘పాగల్’ అంతగా మురిపించలేకపోయాయి. సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, సంపూర్ణేశ్ బాబు ‘బజారు రౌడీ’, సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ వచ్చినా మెప్పించలేదనే చెప్పాలి. ఇక ఓటీటీలో సందీప్ కిషన్ ‘వివాహభోజనంబు’ విడుదలై టైటిల్ కు తగ్గ వినోదం పంచలేకపోయింది. శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ నవ్వులు పూయించి, భలేగా ఆకట్టుకుందనే చెప్పాలి.
అన్నదమ్ముల సందడి!
సెప్టెంబర్ నెలలో తెలుగు సినిమా కళ కాసింత పెరిగిందనే చెప్పాలి… ఈ నెలలో మొత్తం 34 సినిమాలు రాగా, వాటిలో స్ట్రెయిట్ మూవీస్ 22 కాగా, 12 అనువాదాలు వచ్చాయి. నాని నటించిన ‘టక్ జగదీశ్’ ఓటీటీ బాట పట్టడం విశేషం!. గోపీచంద్ ‘సీటీమార్’, నితిన్ ‘మాస్ట్రో’, అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ ఊరించి ఉస్సూరుమనిపించాయి. అయితే నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మంచి విజయం సాధించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, సాయిపల్లవి హీరోయిన్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.
అక్టోబర్ లో 23 స్ట్రెయిట్ మూవీస్ తో పాటు, ఐదు డబ్బింగ్ సినిమాలు జనం ముందు నిలిచాయి. సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, సుమంత్ అశ్విన్ ‘ఇదే మా కథ’, ‘సత్యం’ రామలింగరాజు కోడలు సంధ్యారాజ్ నటించిన ‘నాట్యం’, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటించిన ‘పెళ్ళి సందడి’, కొన్నేళ్ళుగా వెలుగు చూడని గోపీచంద్, బి.గోపాల్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ ఏ సందడీ చేయలేకపోయాయి. దక్కన్ సినిమా ‘ప్యార్ హీ ప్యార్’ సోదీలోనే లేదు. నాగశౌర్య, రీతూ వర్మ నటించిన ‘వరుడు కావలెను’ ఆకట్టుకోగలిగింది. అఖిల్ తన కెరీర్ లో ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజయానికి నాయిక పూజా హెగ్డే అందచందాలూ కారణమని చెప్పవచ్చు. సెప్టెంబర్ లో అన్న నాగచైతన్య, అక్టోబర్ లో తమ్ముడు అఖిల్ విజయాలు సాధించడం విశేషం!
నలిపేసిన నవంబర్
నవంబర్ లో మొత్తం 29 సినిమాలు రాగా, వాటిలో తెలుగు చిత్రాలు 23, అనువాదాలు ఆరు. సంతోష్ శోభన్, మెహరీన్ తో మారుతి రూపొందించిన ‘మంచి రోజులు వచ్చాయి’ పరవాలేదు అనిపించుకుంది. కార్తికేయ ‘రాజా విక్రమార్క’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ఆకట్టుకోలేక పోయాయి. ఈ యేడాది వెంకటేశ్ రెండో సినిమా ‘దృశ్యం-2’ కూడా ఓటీటీలోనే విడుదలయింది. నవంబర్ లో విడుదలైన అనువాద చిత్రాలలో రజనీకాంత్ ‘పెద్దన్న’ పేరులో పెద్ద ఉన్న పెద్దగా సందడి చేయలేక పోయింది. దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ కూడా కుదేలయిపోయింది. సూర్య నటించిన ‘జై భీమ్’ ఓటీటీలో వెలుగు చూసినా భలేగా అలరించింది.
దశ మార్చిన డిసెంబర్!
డిసెంబర్ భలేగా మురిపించిందనే చెప్పాలి. ఈ నెలలో 22 స్ట్రెయిట్ మూవీస్ తో పాటు, ఆరు డబ్బింగ్ సినిమాలు జనం ముందు నిలిచాయి. అన్నిటినీ మించి అన్ సీజన్ గా పేరున్న డిసెంబర్ ప్రథమార్ధంలో బాలకృష్ణ, బోయపాటి మూడో చిత్రం ‘అఖండ’ విడుదలై విజయదుందుభి మోగించింది. ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అందరూ “తెలుగు సినిమా గెలవాలి” అని కోరుకున్నారు. అలాగే ఆ సినిమా గెలుపు తరువాత వచ్చిన స్టార్ మూవీస్ కు విజయాల బాట వేసిందనే చెప్పాలి. ‘అఖండ’ తరువాత రెండు వారాలకు వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సైతం వసూళ్ల వర్షం కురిపించింది. సక్సెస్ మీద ఉన్న హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్ రష్మిక కాంబోలో ‘పుష్ప’ విశేషాదరణ చూరగొందనే చెప్పాలి.
డిసెంబర్ నెలలో నిత్యమీనన్ నిర్మాతగా రూపొందిన తెలుగు చిత్రం ‘స్కైలాబ్’ ఏ మాత్రం సందడి చేయలేకపోయింది… నాగశౌర్య ‘లక్ష్య’, దాంతో పాటే వచ్చిన ‘మనవూరి పాండవులు, కఠారి కృష్ణ’, తరువాత వచ్చిన ‘పులివచ్చింది- మేక చచ్చింది’ ఆకట్టుకోలేక పోయాయి.
క్రిస్మస్ కానుకగా నాని ‘శ్యామ్ సింగరాయ్’ డిసెంబర్ 24న విడుదలకు సిద్ధం కాగా, క్రిస్మస్ నాడే వచ్చిన ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’లో రాజశేఖర్ కూతురు శివానీ నటించింది. చివరగా శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’ డిసెంబర్ 31న జనం ముందుకు రానుంది.
ఏది ఏమైనా తెలుగు సినిమా వెలగాలని కోరుకున్న వారికి డిసెంబర్ మాసమే ఊరట నిచ్చింది. రాబోయే జనవరిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ రానుంది. ఈ సినిమా ఏ రీతిన రికార్డుల మోత మోగిస్తుందో చూడాలని అందరిలోనూ ఓ ఉత్కంఠ నెలకొంది.