‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!
ఆమీర్ ఖాన్, గ్రేసీ సింగ్ స్టారర్ ‘లగాన్’ విడుదలై రెండు దశాబ్దాలు పూర్తైంది. ప్రస్తుతం ఈ క్లాసిక్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో నెటిజన్స్ కు అందుబాటులో ఉంది. 190 దేశాల్లో సినీ ప్రేమికులు ఏఆర్ రెహ్మాన్ ఆల్ టైం మ్యూజికల్ ని చూడవచ్చు. అయితే, ‘లగాన్’ 20 ఏళ్ల మైలురాయి దాటిన సందర్భంగా నెట్ ప్లిక్స్ ఇండియా ఒక రీ యూనియన్ ప్లాన్ చేస్తోంది. ‘ఛలే ఛలో లగాన్’ పేరుతో ఆమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్, ఇతర ‘లగాన్’ క్యాస్ట్ అండ్ క్రూని ఆన్ లైన్ మీటింగ్ కి ఆహ్వానిస్తోంది. త్వరలో యూట్యూబ్ లోని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ ఛానల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
‘లగాన్’ సినిమా అశుతోష్ గోవారికర్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే, ఆమీర్ ఖాన్ కు సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. పర్ఫెక్షనిస్ట్ గా ఆయన పేరు మార్మోగింది. ‘లగాన్’ తరువాత నుంచీ ఏకే సినిమాల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. రొటీన్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు లేదా యాక్షన్ థ్రిల్లర్స్ పూర్తిగా మానేశాడు. ప్రతీ సినిమాని ఏదో ఒక ప్రత్యేకతతో ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆమీర్ నెక్ట్స్… హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ గా రూపొందిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో కనిపించనున్నాడు…