ఏపీలో వరుసగా థియేటర్లు మూత పడుతున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను తగ్గించడంతో ఎగ్జిబిటర్లు వ్యాపారంలో నిలబడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శ్యామ్ సింగ రాయ్, పుష్ప, అఖండ చిత్రాల ప్రదర్శనకు ఆంధ్రాలో తాజా పరిణామాలతో అంతరాయం ఏర్పడింది. కొన్ని థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు చాలామంది థియేటర్ యజమానులు తక్కువ టికెట్ ధరలతో సినిమా హాళ్లను నడపలేము అంటూ స్వచ్చందంగా మూసివేస్తున్నారు.
మరోవైపు ఏపీకి చెందిన ఎగ్జిబిటర్లు కలిసి సమావేశమై ప్రభుత్వం తమపై కఠినంగా వ్యవహరిస్తే నిరసనను వ్యక్తం చేయడానికి పిలుపునిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన దాడులతో కొందరు ఎగ్జిబిటర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి రావడంతో మిగిలిన వారు సినిమాల ప్రదర్శన కొనసాగించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. తెలుగు సినిమా ప్రముఖులు ఉమ్మడి వేదికపైకి వచ్చి ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీలోని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చిరు ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.
