‘అల్లరి’ సినిమాతో 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ దర్శక నిర్మాత ఇవీవీ సత్యనారాయణ రెండో తనయుడు నరేశ్. ప్రముఖ నటుడు చలపతిరావు కొడుకు రవిబాబు తెరకెక్కించిన ‘అల్లరి’ సినిమా నరేశ్ కు ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత ‘తొట్టిగ్యాంగ్, కితకితలు, అత్తిలి సత్తిబాబు, అల్లరే అల్లరి, సీమశాస్త్రి, గమ్యం, బొమ్మనా బ్రదర్స్ – చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావ్ ఆర్ఎంపీ, అహనా పెళ్ళంట, సీమ టపాకాయ్’ వంటి విజయవంతమైన చిత్రాలలో నరేశ్ నటించాడు. చూస్తుండగానే పదేళ్ళ పాటు అతని కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగిపోయింది.
నరేశ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘సుడిగాడు’ సినిమా 2012 ఆగస్ట్ 24న విడుదలైంది. అంటే ఈ రోజుకు ఆ సినిమా విడుదలై పదేళ్ళు. తమిళ చిత్రం ‘తమిళ పాడం’కు ఇది రీమేక్. ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో డి. చంద్రశేఖర్ రెడ్డి ‘సుడిగాడు’ నిర్మించాడు. వసంత్ సంగీతం అందించాడు. విశేషం ఏమంటే… అప్పుడప్పుడే తెలుగులోనూ సెటైరికల్ కామెడీ సినిమాలు వస్తున్నాయి. ఇవీవీ స్కూల్ కు కాస్తంత దగ్గరగా ఉన్నా… సినిమా ప్రారంభం, పాటలు, పోరాటాలు, క్లయిమాక్స్… ఇలా ప్రతి దానిని అతిగా చూపిస్తూ వచ్చిన తొలి తెలుగు సినిమా ఇదే అని చెప్పాలి. ఆ తర్వాత ఇదే కోవలో వచ్చిన మరో సినిమా ‘హృదయ కాలేయం’.
‘సుడిగాడు’లో తండ్రీ కొడుకులుగా నరేశ్ నటించాడు. కామేశ్ భార్య ఓ పిల్లాడికి జన్మనిస్తుంది. వాడు పుట్టడమే ఓ పెద్ద రౌడీ తిక్కలరెడ్డి కొడుకు చావుకు కారణమౌతాడు. దాంతో ఆ పిల్లాడిని ఎలాగైనా అంత మొందించాలని తిక్కల రెడ్డి ప్రయత్నిస్తాడు. దాంతో తన తల్లి చేతికి ఇచ్చి ఊరికి దూరంగా కొడుకు శివను పంపేస్తాడు కామేశ్. ఆ శివ పెరిగి పెద్దయ్యాక తిక్కలరెడ్డికి ఎలా బుద్ధి చెప్పాడనేదే ‘సుడిగాడు’ కథ. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ అతి అనే మాటకు పరాకాష్టగా సాగుతుంది. ఇదేదో కాస్తంత కొత్తగా ఉందని జనం కూడా విశేషంగా ఆదరించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ కు మంచి గుర్తింపు లభించింది. తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇటీవల బిగ్ బాస్ లోనూ మోనాల్ గజ్జర్ పాల్గొని మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ సినిమాలోని సన్నివేశాలే కాదు… పాటలూ పసందుగా ఉండి శ్రోతలను అలరించాయి. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భీమనేని శ్రీనివాస రావు కామెడీ చిత్రాలనూ బాగా తీయగలడని ‘సుడిగాడు’ నిరూపించింది. ఇది తమిళ రీమేకే అయినా…. ఎక్కడా ఆ వాసనలు రాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.
నరేశ్ నటించిన మూడు సినిమాలు 2012లో వచ్చాయి. అందులో ‘సుడిగాడు’ మాత్రమే మంచి విజయం సాధించింది. ఇక అక్కడ నుండి నరేశ్ తో సినిమాలు తీసే ప్రతి డైరెక్టర్ ఓవర్ సెటైరికల్ సీన్స్ పెట్టడం మొదలెట్టారు. దాంతో ప్రేక్షకులకు నరేశ్ సినిమాలు చూసి మొఖం మొత్తడం మొదలైంది. వరుస పరాజయాలు నరేశ్ ను పలకరించసాగాయి. అది మొదలు… నరేశ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి చాలా కాలమే పట్టింది. సోలో హీరోగా నరేశ్ గత యేడాది వచ్చిన ‘నాంది’ సినిమాతోనే మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు. కామెడీని కొంతకాలం పక్కన పెట్టి, సీరియస్ పాత్రలు చేయాలనే ఆలోచన నరేశ్ లో రావడం మంచిదయింది. ఇప్పుడు కూడా నరేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’,’ఉగ్రం’ వంటి కథాబలం ఉన్న సినిమాలలో నటిస్తున్నాడు.
రెండు దశాబ్దాల నరేశ్ కెరీర్ లో ‘సుడిగాడు’ ఓ స్పెషల్ మూవీ. దానికి ముందు, తర్వాత అని నరేశ్ కెరీర్ ను విశ్లేషించాల్సిన సినిమా ఇది. ఆ మూవీ సాధించిన గొప్ప విజయంతో చాలా పాఠాలనే నరేశ్ నేర్చుకున్నాడు. అయితే ఆ సినిమా ఇచ్చిన విజయమే ఆ తర్వాత మరో పదేళ్ళ పాటు నరేశ్ కెరీర్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా సాగిపోవడానికి కారణమైంది. ఆ రకంగా నరేశ్ ను సుడిగాడిని చేసిన సినిమా ఇది!