Mirchi:సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ – డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన హీరోకు మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ రావాలంటే టైమ్ పడుతుందని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆ చట్రంలో చిక్కుకున్నవారే! రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన తొలి చిత్రం ‘ఛత్రపతి’ అప్పట్లో బంపర్ హిట్! ఆ చిత్రం తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ ప్రభాస్ కు దక్కడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. 2005లో ‘ఛత్రపతి’ రాగా, 2013లో వచ్చిన ‘మిర్చి’ ప్రభాస్ కు బంపర్ హిట్ ను అందించింది. మధ్యలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు హిట్స్ గానే మిగిలాయి. ఈ ‘మిర్చి’తోనే కొరటాల శివ దర్శకునిగా పరిచయం కావడం విశేషం! 2013 ఫిబ్రవరి 8న విడుదలైన ‘మిర్చి’ విజయఢంకా మోగించింది. ఆ యేడాది టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ‘యువి క్రియేషన్స్’ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ప్రభాస్ సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి, మిత్రుడు వి.వంశీకృష్ణారెడ్డి నిర్మించారు.
Read Also:Off The Record: పవన్ కల్యాణ్‌పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి
కథ పాతగానే అనిపిస్తుంది. కానీ, స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ కథనంతో రక్తి కట్టించారు. రెండు ఊళ్ల నాయకులు, వారి మధ్య కక్షలు! గొడవలు వద్దని ఓ ఊరి పెద్ద భావిస్తూంటాడు. అయినా వైరి పక్షం కొట్లాటకు సై అంటూ కవ్విస్తూ ఉంటారు. మంచిని కోరుతూ హింసవద్దనే నాయకుని కొడుకు వచ్చి, ప్రత్యర్థులను చిత్తు చేస్తాడు. ఆ విషయం తండ్రికి తెలియడం, ఈ లోగా హీరో తల్లిని వైరివర్గం చంపడం జరిగిపోతాయి. దాంతో తండ్రి, కొడుకును ఇంట్లోంచి గెంటేస్తాడు. వైరి వర్గాల వెన్నులో వణుకు పుట్టించిన హీరో, ఆ రెండు ఊళ్ళ మధ్య సయోధ్యకు నడుం బిగించి విజయం సాధించడమే ఈ ‘మిర్చి’ కథ. దీనిని కొరటాల శివ నడిపిన తీరు ఆకట్టుకుంది. ఈ సినిమా ఘనవిజయంతో కొరటాల శివ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఈ ఘనవిజయం తరువాతే ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ తో మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ప్రభాస్, అనుష్క జంట అంతకు ముందు ‘బిల్లా’లో మురిపించారు. ఆ తరువాత ‘మిర్చి’తోనే అలరించారు. ‘మిర్చి’ తరువాత వరుసగా ‘బాహుబలి-1, బాహుబలి-2’లోనూ ప్రభాస్, అనుష్క కలసి నటించారు. దాంతో వరుసగా మూడు బంపర్ హిట్స్ చూడడం వల్ల ‘హ్యాట్రిక్’ సాధించిన జంటగా ప్రభాస్, అనుష్క నిలిచారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి సక్సెస్ ను వరుసగా అందుకున్న హిట్ పెయిర్ మరొకటి కానరాదు. ఇందులో సత్యరాజ్ హీరో తండ్రిగా నటించారు. తరువాత ఆయన కూడా ‘బాహుబలి’ సిరీస్ లో ప్రభాస్, అనుష్కతో కలసి నటించడం విశేషం! ‘మిర్చి’ చిత్రానికి కొరటాల శివ పదునైన సంభాషణలు ప్రాణం పోయగా, దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సైతం భలేగా సందడి చేశాయి. వాటికి అనువుగా రామజోగయ్య శాస్త్రి పాటలు పలికించారు. ఇందులోని “మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే…”, “ఇదేదో బాగుందే చెలీ…”, “పండగలా దిగివచ్చాడు…”, “నీ చూపుల…”, “డార్లింగే…” అంటూ సాగే పాటలు భలేగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ సినిమాకు ఆరు నంది అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ఎన్నికైన ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా ప్రభాస్, ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా కొరటాల శివ, బెస్ట్ విలన్ గా సంపత్ రాజ్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా ఎ.యస్.ప్రకాశ్, ఉత్తమ నేపథ్యగాయకునిగా కైలాస్ ఖేర్ నిలిచారు. ఈ చిత్రాన్ని కన్నడలో సుదీప్ హీరోగా ‘మాణిక్య’ పేరుతోనూ, దేవ్ హీరోగా బెంగాలీ లో ‘బిందాస్’గానూ, ఒరియాలో ‘బిశ్వనాథ్’ టైటిల్ తోనూ రీమేక్ చేశారు.
‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ వరుసగా తమ ‘యువి క్రియేషన్స్’ బ్యానర్ లోనే ‘సాహో, రాధే శ్యామ్’ చిత్రాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు వసూళ్ళు చూశాయే కానీ, మళ్ళీ ‘బాహుబలి’ స్థాయి సక్సెస్ ను అందించలేకపోయాయి. అంటే- మరోమారు రాజమౌళి సెంటిమెంట్ పనిచేస్తోందన్న మాట! ‘ఛత్రపతి’ తరువాత ‘మిర్చి’తో సూపర్ హిట్ చూసిన ప్రభాస్, మళ్ళీ ‘బాహుబలి’ స్థాయి సక్సెస్ ను ఏ సినిమాతో అందుకుంటారో చూడాలి.
Read Also: NTR: 16 రోజుల్లో నటరత్న మూడు సినిమాలు!