జీవితంలో కొంతమంది మనుషులు ఎప్పుడు ఇతరులను తక్కువగా చూసే అలవాటు కలిగి ఉంటారు. ఆఫీస్‌లోనైనా, పక్కింటివారైనా, పరిచయమున్న వాళ్లైనా – ఈ తరహా వ్యక్తుల మనస్తత్వం మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే వాళ్లు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారంటే, మీరు ఎదుగుతున్నారని, వాళ్లకి మీ ఎదుగుదలపై భయం ఉందని అర్థం. అందుకే దీనిని పాజిటివ్ సైన్‌గా తీసుకుని ముందుకు సాగిపోవాలి.
సమస్యను ఎలా చూడాలో నేర్చుకోండి :
ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, అది మీ వ్యక్తిత్వం కాదని, వాళ్ల ఆలోచనా స్థాయి అని గుర్తించండి. సమస్య ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు, దాన్ని మీరు ఎంతగా పెంచుకుంటున్నారనేదే ముఖ్యం. ఎప్పుడైనా ఎలాంటి సమస్యలనైనా విపరీతంగా ఊహించడం మానేయండి. ఫేస్ చేయడం నేర్చుకుంటే, ఆ ఇబ్బంది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎదైన మనం ఆలోచించే విధానంలో ఉంటుంది.
నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడండి :
“ఇది వర్కౌట్ కాదు” అనే ఆలోచనకే అసలు సమస్య మూలం. మీ విలువ మీకే తెలుసు. ఇతరుల మాటలతో మీ మనసు దిగ జారనివ్వొద్దు. ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయడం నేర్చుకోండి. మీ మీద మీకున్న నమ్మకమే మీకు కవచం. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ ఆలోచన మార్గంలో వెళ్ళండి.
మైండ్‌సెట్‌ను మార్చుకోండి :
మిమ్మల్ని హేళన చేస్తున్నవారు పై మెట్టులో ఉన్నట్లు అనిపిస్తే, దాన్నికి భయపడి దిగజారిపోకండి. బదులుగా, ఆ మెట్టును ఎక్కడానికి ప్రయత్నించండి. సమస్య మీ కన్నా ఒక అడుగు వెనుక ఉండేలా మీరే ముందుకు కదలండి. అలా చేస్తే, సమస్య చిన్నదిగా మారుతుంది. ముఖ్యంగా వారితో పోల్చుకోని మీమల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానుకోండి. వారి కంటే బెటర్ గా ఉండటానికి ట్రై చేయండి.
“లైట్ తీస్కో” ఫార్ములా :
ఎవరైనా చులకనగా చూస్తున్నారంటే, అది మీ ముందడుగు వారికి నచ్చలేదని అర్థం. వాళ్ల మాటలను పట్టుకుని కూర్చుంటే మీరు కదలలేరు. కాబట్టి, లైట్ తీస్కోవడం అలవాటు చేసుకొండి. మీ మైండ్‌సెట్‌తో మీ దారిన మీరు సాగిపోవాలి. ఇదే బెస్ట్ మెడిసిన్.
మౌనమే సమాధానం :
మీపై హేళన చేసినా, మీరు గట్టిగా నిలబడి, పట్టించుకోకుండా ముందుకు సాగిపోతే, వారికి చివరికి ఏం చేయాలో తోచదు. వాళ్లు ఆశించిన రియాక్షన్ రాకపోతే, కొద్ది రోజుల్లోనే వాళ్ల నోళ్లు మూతబడతాయి. కాబట్టి నవ్వుతూ, ప్రశాంతంగా, మీ పనిని చేసుకోవడమే ఉత్తమ మార్గం.