నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో కొంతమందికి అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ లాగించాల్సిందే.. ఒకప్పుడు ఆదివారం మాత్రమే నీసు తినేవారు. ఇప్పుడు వారాలతో సంబంధం లేకుండా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు ఇలా నాన్‌వెజ్ ను పట్టు పడుతున్నారు. అయితే చాలా మంది చికెన్, మటన్ లివర్ ఎక్కువ తింటుంటారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ ఇలా రకరకాలుగా వండుకుని తింటున్నారు. అయితే, చికెన్, మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నష్టమా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లివర్ :
* చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్స్ , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ లివర్ సెలీనియం మంచి మొత్తంలో ఉంటుంది.దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
*అంతేకాదు ఈ సెలీనియం ద్వారా ఆస్తమా, ఇన్ఫెక్షన్, శరీరంలో మంట, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గించడంలో దోహదపడుతుంది .అలాగే చికెన్ లివర్‌తో కంటి, చర్మ, రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. మెదడు చురుగ్గా పని చేసేందుకు ఉపయోగపడే విటమిన్ బి12 ఇందులో పుష్కలంగా ఉంటుంది.
*అయితే ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. లివర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె వ్యాధుల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారు దూరంగా ఉండాలి.
*అంతేకాకుండా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా లివర్ తినకూడదు. అంతగా తినాలి అనుకుంటే వైద్యులను సంప్రదించి తినాలి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని మితంగా తినాలి. ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తినాలి.
మటన్ లివర్ :
*మటన్ ను చాలా రకాలుగా వండుకుంటారు. లివర్ అంటే మటన్ కాలేయం. ఇది మటన్‌లో అత్యంత పోషకమైన భాగం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఇనుము, రాగి, జింక్ వంటివి ఉంటాయి. ఈ మటన్ఐ లివర్ లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.
*అలాగే మటన్ లివర్ లో విటమిన్లు A, B, D ఇందులో అధికంగా ఉంటుంది. దీని వల్ల కళ్లు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు ఎంజైమ్‌లు పనితీరు మెరుగుపరిచి రసాయన ప్రక్రియలను సమతుల్యం చేస్తాయి. మటన్ లివర్‌లో ఉండే విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు నరాల బలహీనత సమస్యలతో బాధపడేవారు కూడా మటన్ లివర్ తింటే ఉపశమనం లభిస్తుంది.
*ఈ మటన్ లివర్ తినడం వల్ల కలిగే నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. గర్భిణీలు మటన్ లివర్ తింటే, పిండంలో కేంద్ర నాడీ వ్యవస్థ, క్రానియోఫేషియల్, గుండెలో పుట్టుకతో వచ్చే లోపాలు ఏర్పడవచ్చు. ఆ కాలంలో లివర్ ఎక్కువగా తింటే బాలింతలకు పాలు బాగా వస్తాయి అని చెప్పేవారు కానీ. ఎంత తక్కువ తింటే అంత మంచిది.
* అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ లివర్ తినకూడదు. మటన్ లివర్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఆస్తమ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మటన్ లివర్ కి దూరంగా ఉండాలి.