పూర్వ కాలానికి.. నేటి ఆధునిక కాలానికి చూసినట్లైతే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు. అందుకే ఆ కాలపు తరం వారు ఎంతో బలంగా ఉండే వారు. ఆరోగ్యంగా ఉండి వైద్యులను సంప్రదించే అవకాశమే ఉండేది కాదు. కానీ నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా జొన్న రొట్టెలు తింటే సంపూర్ణమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జొన్నల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. జొన్న రొట్టెలతో పాటు జొన్న పిండితో చేసిన వంటకాలు ఏవైనా ఈజీగా జీర్ణమవుతాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సగటున ఒక జొన్న రొట్టెలో 1.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపర్చేందుకు ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. జొన్నల్లో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఎంతో మంచి చేస్తుంది. జొన్న రొట్టెలు తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులోని నియాసిన్, థయామిన్, రిబోఫ్లోవిన్ లాంటి బీ-కాంప్లెక్స్ విటమిన్స్ శక్తిని పెంచుతాయి.
జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్‌ను కంట్రోల్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది. జొన్న పిండితో చేసిన పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ శరీరంలో వాపును తగ్గించడంలో సాయపడతాయి. జొన్నల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 వంటివి ఉండటం వల్ల ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది. జొన్న రొట్టెలను రోజు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే జొన్న రొట్టెలను మీ ఫుడ్ లిస్ట్ లో ఇప్పుడే చేర్చుకోండి.
గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. జొన్న రొట్టెలు తినడం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.