సాధారణంగా చాలా మందికి పాములను చూసిన వెంటనే భయం పట్టేస్తుంది. కొందరే ధైర్యంగా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో పాములు చెట్లు, చెరువులు, పొదలు నీటమునగడం వల్ల మనుషుల నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. అడవులు, చెట్లు, నీటి వనరులను మనుషులు అధికంగా వినియోగించడం వల్ల అడవుల్లో తిరగాల్సిన జంతువులు కూడా జనావాసాల్లోకి రావడం పెరిగింది.
వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువ
వర్షాకాలంలో ముఖ్యంగా పాములు ఇళ్ల ప్రాంగణాల్లో, చెట్ల కింద, గదుల్లో కనిపించే అవకాశం ఎక్కువ. వాటిని బయటకు పంపించే క్రమంలో కొంతమందికి పాము కాటు ప్రమాదం జరుగుతోంది. పాము కాటు వేసిన వెంటనే చాలా మంది తీవ్రంగా భయపడటం వల్ల రక్తపోటు (BP) పెరిగి విషం వేగంగా శరీరంలో వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పాము కాటు తర్వాత పాటించాల్సిన కీలక నియమాలు
1. పాము కాటు వేసిన వెంటనే భయపడితే BP పెరిగి విషం వేగంగా శరీరంలో వ్యాపిస్తుంది. కాబట్టి పేషెంట్‌ను ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం.
2. కాటు వేసిన చేతి లేదా కాలి వద్ద ఆభరణాలు వంటివి ఉంటే వెంటనే తొలగించాలి. వాపు వచ్చినప్పుడు అవి బిగిసిపోయే ప్రమాదం ఉంది.
3. పాము కాటు చోటు మరియు ఆ అవయవాన్ని ఎంతవరకు సాధ్యమో కదలకుండా ఉంచాలి. కదిలించటం వల్ల విషం త్వరగా శరీరమంతా వ్యాపిస్తుంది.
4. పాము కాటు ప్రదేశాన్ని నీటితో లేదా సబ్బుతో కడగకూడదు. ఇలా చేస్తే ఏ పాము కాటేసిందో తెలిసే అవకాశం తగ్గుతుంది, దీంతో సరైన చికిత్స ఆలస్యం అవుతుంది.
5. కొంతమంది పాము కాటు ప్రదేశాన్ని నోటితో పీల్చడానికి ప్రయత్నిస్తారు. ఇది అతి ప్రమాదకరం. పీల్చే వ్యక్తి నోటిలో చిన్న గాయాలు ఉన్నా విషం నేరుగా శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది.
6. పాము కాటు వెంటనే పేషెంట్‌కు భరోసా ఇవ్వాలి. భయం, ఒత్తిడి, ఆందోళన నివారించాలి.
7. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ/ప్రైవేట్ ఆసుపత్రుల్లో పాము కాటు చికిత్సకు అవసరమైన యాంటివెనం అందుబాటులో ఉంది. కాబట్టి అత్యవసరంగా పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లడం అత్యంత ముఖ్యము.
ఇలాంటి సూచనలను పాటించడం ద్వారా పాము కాటు వల్ల జరిగే ప్రాణాపాయం నుండి తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పాము కాటు ప్రమాదం జరిగితే భయపడకుండా, ఆచితూచి పై సూచనలను పాటించండి.