తమకెదురైన అతి పెద్ద సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కోవడం ద్వారా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వైజాగ్ లోని డాక్టర్ల బృందం 26 వారాలకే కేవలం 430 గ్రాముల బరువుతో జన్మించిన అర్జున్ వర్మకు ప్రాణం పోశారు. ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఎదురైనా, 85 రోజుల పాటు నిరంతరాయంగా అందించిన చికిత్స తరువాత హాస్పిటల్ నుంచి అతనిని డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్‌లో అత్యంత వేడుకగా నిర్వహించిన ఎన్‌ఐసీయూ గ్రాడ్యుయేషన్ వేడుకలో అర్జున్ వర్మతో పాటుగా అదే నెలలో, నెలలు నిండకుండానే జన్మించిన మరో నలుగురు శిశువులను సైతం డిశ్చార్జ్ చేశారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వైజాగ్ లోని సీనియర్ ప్రసూతి వైద్యులు డాక్టర్ సీహెచ్ రాగసుధను 29–03–2022వ తేదీన శ్రీమతి హనీషా కేవలం ఐదున్నర నెలల గర్భవతిని అయినప్పటికీ నీరు బయటకు వస్తుందంటూ కలిశారు. ఆమెకు అత్యవసరంగా చేసిన అలా్ట్రసౌండ్ పరీక్షలో ఆమె గర్భంలో అసలు ఉమ్మినీరు లేదని తేలింది. అదృష్టవశాత్తు తల్లి నుంచి బిడ్డకు రక్త సరఫరాలో మాత్రం ఎలాంటి అంతరాయమూ కలుగలేదు.
అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్ తాలూకా లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదు.తల్లిదండ్రులతో పాటుగా ఎన్‌ఐసీయు సిబ్బందితో చర్చించిన మీదట డాక్టర్ రాగసుధ, తక్షణమే డెలివరీ చేయకుండా కొన్నాళ్లపాటు గర్భం పొడిగించాలని నిర్ణయించారు. అదే సమయంలో తల్లి, బిడ్డల ఆరోగ్యం, భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లకూడకుండా తగిన జాగ్రత్తలూ తీసుకున్నారు. తల్లి గర్భంలో శిశువు గడిపే ప్రతి రోజూ ఆ శిశువు జీవించేందుకు ఉన్న అవకాశాలు కూడా మెరుగవుతాయి. శిశువు ఊపిరితిత్తులు మరియు మెదడు ఎదిగేందుకు తగిన ఔషదాలను శ్రీమతి హనీషా కు అందించారు. దురదృష్టవశాత్తు, ఎనిమిది రోజుల తరువాత శ్రీమతి హనీషాకు శస్త్రచికిత్స చేసి 07 ఏప్రిల్ 2022వ తేదీన మగ శిశువును డెలివరీ చేశారు. ఈ డెలివరీ సమయంలో డాక్టర్ విశాల్ కోలీ నేతృత్వంలో డాక్టర్ రాగసుధతో పాటుగా ఎన్‌ఐసీయు డాక్టర్లు, నర్సులతో కూడిన బృందం పాల్గొంది.
పుట్టిన వెంటనే అర్జున్ తనంతట తానుగా శ్వాసించలేదు. అతనికి ఇంట్యుబేషన్ అవసరం పడింది. అతి చిన్న పరిమాణం కలిగిన ఎండోట్రాచియల్ ట్యూబ్‌తో దీనిని అమర్చారు. అతని ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడేందుకు సర్ఫెక్టెంట్ గా పిలువబడే ఔషదాన్ని అందించారు. డాక్టర్ విశాల్ కోలీ మాట్లాడుతూ ‘‘ ముందుగా అతనిని పరిశీలించిన తరువాత మేము మాకు భారీ సవాల్ ఎదురుగా ఉందని గుర్తించాము. అర్జున్ పుట్టినప్పుడు కేవలం 430 గ్రాముల బరువుతో ఉన్నాడు. సాధారణంగా నవజాత శిశువులు దాదాపు 3 కేజీల బరువుతో పుడతారు. అర్జున్ అవయవాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉన్నాయి. అతను తనంతట తానుగా జీవించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అతని శరీరంలో తగిన పోషక నిల్వలు కూడా లేవు. అదీగాక అతను ఇన్‌ఫెక్షన్ల బారిన పడేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అతని చర్మం చాలా పలుచగా ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో నీరు, వేడి కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అర్జున్ ఉన్న స్ధితిలో సాధారణ కాంతి, శబ్దాలు కూడా అతని కళ్లు, చెవులకు నష్టం కలిగించవచ్చు. మేము అతనిని ప్రత్యేకమైన ఇన్‌క్యుబేటర్‌లో ఉంచాము. ఆ ఇన్‌క్యుబేటర్ లోపల పూర్తి చీకటిగా ఉండటంతో పాటుగా అతి తక్కువ శబ్దం మాత్రమే వినబడేలా చేశాము’’ అని అన్నారు.
అతని ప్రయాణాన్ని గుర్తుకు చేసుకున్న డాక్టర్ అన్వేష్ అమితి మాట్లాడుతూ ‘‘ఎన్‌ఐసీయులో ఉన్నప్పుడు, అర్జున్‌కు దాదాపు 50 రోజుల పాటు వెంటిలేటర్ కావాల్సి వచ్చింది. దీనిని అనుసరించి ఆక్సిజన్ మద్దతును మరో 25 రోజులు అందించాము. అతనికి అవసరమైన పోషకాలను అతని నరాల ద్వారా అందించడంతో పాటుగా తల్లి పాలను కూడా అందించాము. తద్వారా అతని ఎదుగుదల, బ్లడ్ షుగర్ స్ధాయి మెరుగుపరిచాము. అర్జున్ పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటిలో ఆక్సిజన్ స్ధాయిలలో ఒడిదుడుకులు, కామెర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అతి తక్కువ నెలలకే జన్మించిన కారణంగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, పుట్టినప్పుడు అతి తక్కువ బరువు ఉండటం వంటివి ఉన్నాయి. కానీ అతని తల్లిదండ్రులకు తగిన స్ఫూర్తినందించడం వల్ల వారు అత్యంత కఠినమైన ఈ ప్రయాణంలో ఎన్‌ఐసీయు సిబ్బందితో పాటుగా సానుకూలమైన మద్దతును అతనికి అందించారు’’ అని అన్నారు. డాక్టర్ విశాల్ కోలీ, డాక్టర్ అన్వేష్ అమితి, డాక్టర్ శ్రీలత పులి మరియు అత్యంత అనుభవజ్ఞులైన, అత్యంత జాగ్రత్తగా చూసుకునే ఎన్‌ఐసీయు నర్సింగ్ సిబ్బంది మార్గనిర్దేశకత్వంలో అర్జున్ నియో నాటల్ కేర్‌ను అందుకున్నాడు.
శ్రీమతి హనీషా మాట్లాడుతూ ‘‘తొలి రెండు వారాలూ మాకు తీవ్ర ఒత్తిడి కలిగించాయి. మా బాబు ఇన్‌క్యుబేటర్‌లో ఉంటాడని , వైర్లు, ట్యూబ్‌లు అతన్ని చుట్టుముట్టి ఉంటాయని అసలు ఎన్నడూ మేము ఊహించలేదు. కాకపోతే ఇంతటి బాధలోనూ మాకు ఆశాకిరణంలా కనిపించిన ఒకే ఒక్క అంశం ఏమిటంటే, ఎన్‌ఐసీయు బృందం అత్యుత్తమంగా శ్రమిస్తూ పోరాతుండటం. మా డాక్టర్లు మమ్మల్ని మా బాబును తాకమని ప్రోత్సహించేవారు. తల్లిదండ్రుల స్పర్శ, గొంతు వినడం ద్వారా అతను స్పందిస్తాడనే వారు. నేను మా బాబును తాకిన క్షణం ఇప్పటికీ మరువలేను. అతను నా వేలిని పట్టుకున్నాడు. అదో అద్భుతమైన క్షణం. మా అర్జున్ చేస్తోన్న పోరాటంలో విజయం సాధించేందుకు అవసరమైనవన్నీ సమకూర్చడం ద్వారా సహాయపడాలని అప్పుడే మేము నిర్ణయించుకున్నాము’’ అని అన్నారు.
డాక్టర్ శ్రీలత పులి మాట్లాడుతూ ‘‘అర్జున్ శరీర బరువు ఒక కేజీ చేరడానికి 45 రోజులు పట్టింది. ఇప్పుడు అతని బరువు 1.7 కేజీలు. తనకు ఎదురైన కష్టాలతో 85 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన తరువాత అర్జున్ ఇప్పుడు సగర్వంగా ఇంటికి, జీవితంపై తాను సాధించిన గెలుపుతో వెళ్తున్నాడు. అతని అవయవాలన్నీ సాధారణ స్థితిలో, అంటే నెలలు నిండిన శిశువుకు తల్లి గర్భంలో ఏ విధంగా అయితే అవయవాలు వృద్ధి చెందుతాయో అదే రీతిలో అభివృద్ధి చెందాయని పరీక్షలు నిర్థారించాయి. అతని ఎదుగుదలను క్రమం తప్పకుండా పరీక్షించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. గత నెలలోనే, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వైజాగ్ అసాధారణంగా కేవలం 24–27 వారాల గర్భం కలిగినప్పటికీ జన్మించిన ఐదుగురు శిశువులను డిశ్చార్జ్ చేయడం జరిగింది. పుట్టినప్పుడు ఈ శిశువుల బరువు 430 గ్రాముల నుంచి 850గ్రాములు మాత్రమే ఉంది. వీరంతా కూడా అర్జున్ లాగానే కష్టాలను ఎదుర్కొన్నారు. వీరంతా కూడా సుదీర్ఘకాలం పాటు హాస్పిటల్‌లో గడపాల్సి వచ్చింది. కానీ ఈ శిశవులు పూర్తి ఆరోగ్యంతో, ఎలాంటి సమస్యలూ లేకుండా ఇంటికి వెళ్లగలిగారు. ఇది ఓ భారీ విజయం.
ఈ విధంగా సంతోషంగా తమ శిశువును తీసుకువెళ్లిన శ్రీమతి అలేఖ్య– వెంకటేష్ మాట్లాడుతూ ‘‘మా బేబీ గర్భం దాల్చిన 25 వారాలకే కేవలం 830 గ్రాముల బరువుతో అనకాపల్లిలో జన్మించింది. మా డాక్టర్ అప్పుడు కేవలం రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మాత్రమే మీ బేబీని కాపాడగలదని చెప్పారు. మేము రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వైజాగ్‌కు మా బేబీని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాము. నేడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆరోగ్యవంతంగా మా బేబీని ఇంటికి తీసుకువెళ్ల గలుగుతున్నాము’’ అని అన్నారు.
వృత్తిరీత్యా ప్రొక్లెయిన్ డ్రైవర్ అయిన మరో సంతోషకరమైన తండ్రి శ్రీ కె ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ మాకు కవల పిల్లలు పుట్టిన తరువాత, ఏం జరుగుతుందనేది మాకు తెలియదు కానీ మా బేబీస్ ఇద్దరూ వెంటిలేటర్‌పైకి వెళ్లారు. ఆర్ధికంగా మేము ఖర్చు పెట్టే స్థితిలో లేనప్పటికీ, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మాకు ఈ ప్రయాణంలో ఎంతగానో సహాయపడింది. ఈ రోజు మేము పూర్తి సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉన్న పిల్లలను ఇంటికి తీసుకు వెళ్తున్నాము. నిస్వార్ధంగా సేవలనందించిన రెయిన్ బో చిల్ట్రన్స్‌హాస్పిటల్ బృందానికి ధన్యవాదములు తెలుపుతున్నాను’’ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో నెలలు నిండకుండానే ప్రసవాలు, ఆ తరహా ప్రసవాలలో పుట్టిన శిశువుల మరణాలు సంభవిస్తుంటాయి. యుఎస్‌ఏ, యుకె లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో అర్జున్ లాంటి అసాధారణ ప్రీ టర్మ్ మరియు ఎదుగుదల ఆగిన శిశువులలో జీవించే అవకాశాలు 25–30% మాత్రమే ఉంటాయి. అతి కొద్ది సంఖ్యలో మాత్రమే శిశువులు ఎలాంటి సమస్యలు లేకుండా బ్రతుకుతారు. నేడు, వైజాగ్‌లోని రెయిన్‌బో బృందం ఈ తరహా అతి సున్నితమెన శిశువులకు అత్యంత నైపుణ్యంతో చికిత్సనందించడంతో పాటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫలితాలను సాధించింది.
డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల, క్లీనికల్ డైరెక్టర్ – ఐసీయు సర్వీసెస్ మాట్లాడుతూ ‘‘ఈ విజయ రహస్యం టీమ్ వర్క్‌లోనే ఉంది. అనుక్షణం మా నిష్ణాతులైన నియోనాటాలజిస్ట్‌లు , అత్యద్భుతైన నర్సింగ్ కేర్ మరియు అత్యాధునిక మౌలిక వసతుల లభ్యత అనేవి మా విజయానికి కీలక కారణాలు. మా నైపుణ్యవంతమైన ఫెటల్ మెడిసన్ మరియు ప్రసూతి బృందం ఈ తల్లుల ఆరోగ్యం పట్ల భరోసా అందిస్తూనే వారి గర్భాధారణ కాలాన్ని వీలైనంతగా పొడిగించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు నెలలు నిండకుండానే శిశువులు జన్మిస్తుంటారు. ఈ శిశువుల మెరుగైన ఆరోగ్యం పరంగా ఉత్తమ ఫలితాలకు మా ఎన్‌ఐసీయు బృందం భరోసా అందిస్తుంది’’ అని అన్నారు.
‘‘ఓ గ్రూప్‌గా రెయిన్ బో హాస్పిటల్ ఇప్పటి వరకూ 1కేజీ కంటే తక్కువ బరువు కలిగిన 1200 మందికి పైగా శిశువులను కాపాడింది. వీరిలోనూ అతి తక్కువగా 375 గ్రాముల బరువు కలిగిన శిశువు కూడా ఉంది. ఆగ్నేయాసియాలో అతి చిన్న శిశువుగా చరిత్ర సృష్టించడంతో పాటుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 2016లో వరల్డ్ ప్రీమెచ్యూర్ డే పురస్కరించకుని రెయిన్‌బో హాస్పిటల్, 445 మంది చిన్నారులు అంటే నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులను ఒకే దరికి చేర్చి ప్రీ మెచ్యూర్ బర్త్ వల్ల కలిగే సమస్యల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒకే చోట ఇంతటి భారీ స్థాయిలో ప్రీ మెచ్యూర్ శిశువులు పుట్టడం ఇది తొలిసారి. ఈ రికార్డు ‘ప్రతి శిశువుకూ జీవించేందుకు హక్కు ఉంది’ అంటూ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వద్ద పూర్తి అంకితభావంతో సేవలనందిస్తున్న మా డాక్టర్లు, నర్సులు మరియు సిబ్బంది సేవలకు ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది’’ అని దినేష్ జోడించారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యూనిట్ హెడ్ అనిల్ కుమార్ కథల తో పాటుగా డాక్టర్ శశ్వత్ మోహంతీ; డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ ఎంఎన్‌వీ పల్లవి ; డాక్టర్ ఎంవీఆర్ శైలజ ; డాక్టర్ నీహారిక అల్లు మరియు ఇతర హాస్పిటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.