High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి. అయితే.. సహజంగా అధిక రక్తపోటును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే తగినంత నీరు తాగటం అలవాటు చేసుకోండని చెబుతున్నారు నిపుణులు. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్‌లో గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉండటానికీ అధిక రక్తపోటు, గుండె వైఫల్యం ముప్పులు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇజ్రాయెల్‌లోని బార్-ఇలాన్ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. పరిశోధకులు నాలుగు లక్షలకు పైగా మంది ఆరోగ్య వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు.
READ MORE: CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత..
తగినంత నీరు తాగితే సహజంగానే సోడియం సాంద్రత తగ్గుతుంది. దీన్ని చిన్న విషయంగా భావించటం తగదని, ఇది దీర్ఘకాల గుండెజబ్బుల నివారణకు సమర్థమైన మార్గమని చెబుతున్నారు. రక్తంలో సోడియం మోతాదులు 135-146 ఎంఎంఓఎల్/ఎల్ ఉండటం నార్మల్‌గా భావిస్తారు. ఇవి పైస్థాయికి చేరుకోకముందే ముప్పులు పెరుగుతుండటం గమనించదగ్గ విషయం. సోడియం మోతాదులు 140 నుంచి 146 ఎంఎంఓఎల్/ఎల్ ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండె వైఫల్యం తలెత్తే అవకాశం పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వయసు, లింగ భేదం, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, పొగ తాగే అలవాటు, పొటాషియం మోతాదుల వంటి వాటిని పక్కనపెట్టి చూసినా వీటి మధ్య సంబంధం కనిపిస్తుండటం విశేషం. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్/ఎల్ కన్నా మించగానే అధిక రక్తపోటు ముప్పు 29%, గుండె వైఫల్యం ముప్పు 20% పెరుగుతున్నట్టు తేలింది. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా కీలకమని ఇది తెలియజేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది మారుతుంటుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.