Korra Lemon Rice Recipe: ఇంట్లో ఆడవాళ్లకు ఉదయం లేవగానే ఎలాంటి టిఫిన్ చేయాలి? అనే ఆలోచన మొదలవుతుంది. కొందరు రాత్రి నుంచి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచే టిఫిన్స్ చేయాలని తాపత్రయపడుతుంటారు. అలాంటి వాళ్లకు బెస్ట్ టిఫిన్ రెసిపీని తీసుకొచ్చాం. భోజనానికైనా, ఉదయం అల్పాహారానికైనా బెస్ట్ టిఫిన్ ఇది. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో పెట్టుకోవడానికి బాగా కుదిరిపోతుంది. సాధారణంగా మనం బియ్యం, గోధుమలకే ఎక్కువగా అలవాటు పడిపోతాం. కానీ రోజువారీ ఆహారంలో మిల్లెట్లను కూడా చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొర్రల అన్నం ఆరోగ్యంగా ఉండే, తేలికగా జీర్ణమయ్యే, రోజులో ఏ సమయానికైనా సరిపోయే ఒక మంచి వంటకం. సాధారణ నిమ్మ అన్నానికి బదులుగా కొర్రలతో చేస్తే రుచి కూడా బాగుంటుంది. అందుకే ఇప్పుడు మనం కొర్రలతో సంప్రదాయ వంటకాన్ని తయారు చేద్దాం..
READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తయారీ విధానం..
ముందుగా కొర్రలను ఉడికించుకుని పెట్టుకోవాలి. ఒక కప్పు కొర్రలకు సుమారు ఒకన్నర కప్పుల నీళ్లు వేసి ప్రెషర్ కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. బాగా ఉడికిన గింజలు విడివిడిగా ఉండేలా చూసుకోవాలి. ముందురోజు ఉడికించిన కొర్రలు ఉంటే ఇంకా బాగా కుదురుతుంది. అన్ని కూరగాయలు, మసాలాలు ముందే సిద్ధం చేసుకుంటే ఈ వంటకం చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు స్టౌవ్ మీద బరువైన పాన్ లేదా కడాయి పెట్టి నువ్వుల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పల్లీలు వేయాలి. మంట తక్కువగా ఉంచి, పల్లీలు బాగా వేగే వరకు ఓపికగా కలుపుతూ ఉండాలి. అవి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయాలి. ఇప్పుడు కరివేపాకు, తురిమిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పసుపు వేసి కొద్దిసేపు కలపాలి. వాసన రాగానే తరిగిన క్యారెట్ వేసి ఒకటి రెండు నిమిషాలు వేయించాలి. క్యారెట్ కొద్దిగా మెత్తబడితే చాలు. అప్పుడే ఉడికించిన మిల్లెట్‌ను పాన్‌లో వేసి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిల్లెట్ గింజలన్నీ తాలింపు మసాలాతో కలిసేలా మెల్లగా తిప్పాలి. మంట తగ్గించి మూత పెట్టి రెండు నిమిషాలు ఆవిరి పట్టనివ్వాలి. తర్వాత మూత తీసి నిమ్మరసం పిండి మరోసారి కలపాలి. ఉప్పు, కారం సరిపోతున్నాయా చూసుకుని అవసరమైతే సర్దుకోవచ్చు. చివరగా కొత్తిమీర ఆకులు వేసి కలిపి స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఇంతే.. గుమ గుమలాడే కొర్రల లెమన్ రైస్ రెడీ. టమాటా ఉల్లిపాయ రాయితాతో గానీ, లేకపోతే సాదా పెరుగుతో గానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.