పాములంటే చాలా మందికి భయం. కొందరైతే పాము దూరంగా ఉన్నా కూడా అది తమవద్దకే వస్తుందనే భావనతో గజగజ వణుకుతూ ఉంటారు. పాము కాటు చాలా ప్రమాదకరం. కొన్ని విషపూరిత పాముల కాట్ల వల్ల తీవ్రమైన నొప్పి, రక్తంలో విషప్రభావం, అలాగే శరీర భాగాల్లో నెక్రోసిస్ ఏర్పడి ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే పాములంటే భయం సహజమే.
పాములు వాతావరణాన్ని గుర్తించే అద్భుత శక్తి ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇవి వాతావరణ మార్పులను చాలా సున్నితంగా గుర్తిస్తాయన్నారు. ఎండాకాలం, వర్షాకాలం వంటి సమయంలో గ్రామాల్లో పాముల ఎక్కువగా తిరుగుతుంటాయి. అయితే.. చలికాలంలో ఎక్కువ సమయం నిద్రావస్థలో ఉంటాయని పేర్కొన్నారు.. ఇది హైబర్నేషన్ లాంటిదే కానీ సర్పాలకు ప్రత్యేకమైన జీవస్థితి.
చాలామంది పాములు రాత్రి సమయంలో నిద్రపోతాయని అనుకుంటారు కానీ అది నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ నిజానికి చాలా పాములు పగటి పూట నిద్రపోయి, రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటాయని వెల్లడించారు. భారీ పరిమాణం కలిగిన పైథాన్ వంటి పాములు రోజులో చాలా గంటలు నిద్రించి, రాత్రి ఆహారం కోసం బయటికి వస్తాయన్నారు.
సాధారణంగా పాములు 16 గంటలు నిద్రపోతాయని నిపుణులు చెబుతున్నారు.ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో కనిపించే పెద్ద పైథాన్లు కనీసం 18 గంటలకు పైగా నిద్రిస్తాయన్నారు. పాములకు కనురెప్పలు ఉండవు. స్పెక్టికేల్ (Spectacle) లేదా ఐక్యాప్ అని పిలువబడే పారదర్శక రక్షణ పొర కళ్లపై ఉంటుదని చెప్పుకొచ్చారు.పాములు నిద్రలో ఉన్నప్పుడు వాటి జీవక్రియ రేటు తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, శ్వాస నెమ్మదించడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.