రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడిని పూసుకునే వారు. వీటి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా చర్మ వ్యాధుల నుంచి ఈ రంగులు రక్షణ కల్పిస్తాయి. కానీ.. ప్రస్తుతం మార్కెట్లో లభించే రంగుల్లో కెమికల్స్ వాడుతున్నారు. ఇవి మన చర్మానికి హాని కలిగిస్తాయి. కళ్లకు కూడా హాని చేస్తాయి. అందుకే హోలీ ఆడే ముందు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి..
ఈ నియమాలు పాటించండి..
హోలీ ఆడేముందు శరీరమంతా నూనె రాసుకోవాలి. జుట్టుకు నూనె పట్టించాలి. ఒకవేళ శరీరంపై గాయాలేవైనా ఉంటే, ఆ గాయాలపై బ్యాండెజ్ వేసుకోవాలి. అందువల్ల రంగులు గాయాన్ని చేరవు. ఒకవేళ సహజమైన రంగులతోనే హోలీ ఆడినా సరే, ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ముఖంపై దద్దుర్లు, తామర వంటివి ఉంటే గనుక, మొదట సంబంధిత ఆయింట్మెంట్, ఆ తరువాత నూనెను రాయాలి. ఆడ, మగ ఎవరైనా సరే, మొదట సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసాక, నూనె రాసుకోవాలి. బాలికలు, మహిళలు తమ చేతివేళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్‌ను వేసుకోవాలి. అందువల్ల ఆ రంగు గోళ్ల కుదుళ్లకు చేరదు.
కళ్లు జాగ్రత్త..!
రంగులు నేరుగా కళ్లకు చేరకుండా మొఖానికి కళ్లజోడు ధరిస్తే మంచిది. కళ్లద్దాలు పెట్టుకోకపోయినా సరే, ఆ రంగులు కళ్లపై పడకుండా, జాగ్రత్తగా ఆడుకోవాలి. సాధారణ కాటన్ దుస్తులు లేదా పాతవైన ధరించి హోలీ ఆడుకోవాలి. ఆ దుస్తులను మిగిలిన రోజుల్లో వేసుకోకుండా ఉంటేనే మంచిది. లేదంటే మరుసటి ఏడాది కోసం భద్రపర్చుకోవచ్చు. కొన్ని రంగుల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వెంటనే ఆ రంగును నీటితో శుభ్రం చేసుకోవాలి. అలెర్జీగా అనిపించిన చోట, నీటితో కడిగాక ఐస్‌తో మర్దన లేదా పెరుగు రాయడం వంటివి చేయాలి. లేదంటే అలోవెరా జెల్ కూడా రాయొచ్చు. అన్ని సూచనలు పాటిస్తూ ఆనందంగా పండుగ జరుపుకోండి.. అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు..