Site icon NTV Telugu

Trump-Zohran Mamdani: వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమైన మమ్దానీ.. ట్రంప్‌తో చర్చలు

Trump Zohran Mamdani

Trump Zohran Mamdani

నిన్నామొన్నటిదాకా ట్రంప్ కారాలు.. మిరియాలు నూరారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ వ్యక్తికే ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు వైట్‌హౌస్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పరిస్థితులు ఎప్పుడూ.. ఒకేలా ఉండవని చెప్పడానికి ఈ వీడియోనే చక్కటి ఉదాహరణ.

జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా డెమోక్రాట్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అంతే ట్రంప్ నోటికి పని చెప్పారు. సైద్ధాంతికంగానే కాకుండా.. మతద్వేషంతో, జాతి వివక్షతో అత్యంత పరుషమైన భాషలో మమ్దానీపై విమర్శల దాడికి దిగారు. మమ్దానీని వందశాతం కమ్యూనిస్ట్‌ పిచ్చోడు అంటూ వ్యాఖ్యానించారు. మమ్దానీ మతవిశ్వాసాన్ని ఎత్తిచూపుతూ ఉగ్రవాద సానుభూతిపరుడు.. హమాస్‌ ఉగ్రవాది అంటూ మాట్లాడారు. ప్రత్యర్థులు ఎన్ని తిట్టినా మమ్దానీ చిరునవ్వుతోనే ప్రచారంలో దూసుకుపోయారు. తీరా న్యూయార్క్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జోహ్రాన్ మమ్దానీ గెలిచారు.

ఇది కూడా చదవండి: Off The Record: కడియం, దానంలపై వేటు తప్పదా?.. అందుకే ఆచితూచి వ్యవహారమా?

ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తిట్టిన నోటితోనే ఇప్పుడు ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు. శుక్రవారం మమ్దానీ వైట్‌హౌస్‌కు వచ్చారు. దీంతో ట్రంప్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ న్యూయార్క్ అభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధికి సహకరించాలని మమ్దానీ కోరారు. ఇక ఈ సందర్భంగా మమ్దానీతో కలిసి ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరి కలను నిజం చేయడానికి.. సురక్షితమైన న్యూయార్క్‌ను నిర్మించడానికి సహాయం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. మమ్దానీ మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తి అంటూ కొనియాడారు.

ఇది కూడా చదవండి: Betting Apps : నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి విచారణ పూర్తి!

మీడియా సమావేశంలో అధ్యక్షుడి కుడి వైపునే మమ్దానీ వినయంగా నిలబడి ఉన్నారు. న్యూయార్క్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందిస్తున్నానంటూ చిరునవ్వుతో ట్రంప్ అభినందించారు. అద్భుతమైన పోటీని ఇచ్చాడంటూ ప్రశంసించారు. పార్టీ పరమైన విభేదాలను పక్కన పెట్టడం తనకు సంతోషంగా ఉందని.. మమ్దానీ బాగా పని చేస్తే తాను కూడా సంతోషంగా ఉంటానని పేర్కొన్నారు.

జనవరి 1న న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ట్రంప్‌ను కలిసే ముందు మమ్దానీ మాట్లాడుతూ.. ‘‘న్యూయార్క్ వాసులకు ప్రయోజనం చేకూర్చే ఏ ఎజెండాపైనైనా నేను ఆయనతో కలిసి పనిచేస్తానని.. ఇదే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు స్పష్టం చేయాలనుకుంటున్నాను.’’ అని న్యూయార్క్ సిటీ హాల్ వెలుపల విలేకరులతో అన్నారు.

Exit mobile version