ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం 4 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. తొలుత సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపింది. కానీ ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో చర్చలు జరిపారు. అటు తర్వాత వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాధినేతలతో ట్రంప్ చర్చలు జరిపారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చారు.
అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ స్వయంగా రంగంలోకి దిగి జెలెన్‌స్కీ, పుతిన్‌తో 28 పాయింట్ల ప్రణాళికపై చర్చించారు. పుతిన్ సానుకూల సంకేతం వ్యక్తపరచగా… జెలెన్‌స్కీ తిరస్కరించారు. దీంతో శాంతి ఒప్పందం మొదటికొచ్చింది. క్రిస్మస్ సమయానికి మంచి శుభవార్త ప్రకటిస్తారని అనుకుంటే అది జరగలేదు.
తాజాగా జెలెన్‌స్కీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆదివారం ఫ్లోరిడాలో ట్రంప్‌ను కలవబోతున్నట్లు ఎక్స్‌లో ప్రకటించారు. ముఖ్యంగా 20 పాయింట్ల ప్రణాళికపై చర్చించబోతున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌కు కల్పించాల్సిన భద్రతాపై చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అమెరికా, ఉక్రెయిన్ కాకుండా ఐరోపా దేశాలు కూడా పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంత తక్కువ సమయంలో సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ట్రంప్ నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు లభిస్తే గనుక రెండు దేశాల మధ్య శాంతి విరజిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధానంగా ట్రంప్‌తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్ భద్రతా, ఆర్థిక ఒప్పందంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే యుద్ధం కారణంగా ఏర్పడిన సమస్యలను కూడా జెలెన్‌స్కీ లేవనెత్తనున్నారు. కచ్చితమైన భద్రతా హామీలు తీసుకున్నాకే శాంతి ఒప్పందానికి జెలెన్‌స్కీ ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శాంతి ఒప్పందానికే రష్యా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సాగదీత ధోరణి అవలంభించకూడదని భావిస్తున్నట్లు సమాచారం. రేపు ఏం జరగబోతుందో వేచి చూడాలి.
