Study For Jobs: చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని భావిస్తారు. కాన ఇప్పుడున్న యువత ఉద్యోగాలొచ్చే చదువే కావాలని కోరుకుంటోంది. అంటే చదువు అంటే తనకు జ్ఞానం కావాలి.. తరువాత ఉద్యోగం కావాలని భావించే రోజులు పోయాయని.. ఇప్పుడు కేవలం ఉద్యోగాలొచ్చే చదువే కావాలని యువత కోరుకుంటోందని ఒక సర్వేలో వెల్లడయింది. భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించే విధంగా ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులు కావాలని నేటి యువత కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. యూఎన్ గ్లోబల్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుమారు 40.5 శాతం మంది యువత ఉద్యోగాలొచ్చే చదువులే కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
Read also: Join My Wedding: పెళ్లి చేసుకోండి.. కోట్లు సంపాదించండి
స్వతంత్ర జీవనానికి, ఆర్థిక, సామాజిక భద్రతకు భరోసానిచ్చేలా చదువు ఉండాలన్నది తమ అభిలాషగా 10 నుంచి 24 ఏళ్ల వయసున్న గ్రూపులోని 40.5శాతం మంది తెలిపారు. ‘యువత ఏం కోరుకుంటోంది’ అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుబంధ సంస్థ అయిన పీఎంఎన్‌సీహెచ్ ప్రపంచవ్యాప్త రియల్‌టైమ్ సర్వేను నిర్వహించింది. 10 నుంచి 24 ఏళ్ల వయసున్న 7,13,273 మందితో లిఖితపూర్వకంగా సర్వే నిర్వహించింది. వారిలో మన దేశానికి చెందిన వారు 17.2శాతంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 12న జరుపుకునే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే నిర్వాహకులు శుక్రవారం మధ్యంతర నివేదిక విడుదల చేశారు. సర్వేలో 15-19 వయసు గ్రూపు వారు 47.2 శాతం మంది ఉన్నారు. వారిలోనూ కిశోరప్రాయ బాలికలు 49.2 శాతం మంది ఉన్నారు. వారు ప్రస్తావిస్తున్న అంశం ఏమిటంటే..చదువుతోనే అవకాశాలుండాలని, నాణ్యమైన విద్య లభించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాగే చదువుతో భద్రత… భరోసానిచ్చే వాతావరణం ఉండాలని 21.2శాతం మంది చెప్పారు. మంచి ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు 16.3శాతం మంది తెలిపారు. కిశోరప్రాయ బాలురు… విద్యకు వెళుతున్న సమయంలో పరిశుద్ధమైన నీరు, మంచి రహదారులు ఉండాలని సూచించగా.. అదే వయసు బాలికలు పరిశుద్ధమైన నీరు అందుబాటులో ఉండాలని తెలపడంతో పాటు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలన్నారు.నేటి యువత ఏమీ కోరుకుంటుందేమిటో తెలుసుకుని దేశాల వారీగా వాటిని సాకారం చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు.. అదేవిధంగా విధాన నిర్ణేతలను ఒప్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని పీఎంఎన్‌సీహెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెల్గా ఫాగ్‌స్టాడ్ సర్వే గురించి స్పష్టం చేశారు.