Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక గొప్ప లౌకిక వ్యక్తిని, ఒక తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తికి పోలిక తీసుకురావడం ఏంటని బంగ్లాలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. 1976లో నజ్రుల ఇస్లా మరణం తర్వాత, 50 ఏళ్లకు ఆయన సమాధి పక్కనే హాదిని ఖననం చేశారు.
షేక్ హసీనాను గద్దె దింపడంలో కీలకంగా వ్యవహరించిన ‘‘ఇంక్విలాబ్ మంచా’’ అధినేత హాదిని ఈ నెల 12 ఇద్దరు వ్యక్తులు గన్‌లో కాల్చారు. తీవ్రగాయాలైన అతను 19న మరణించాడు. తరుచుగా, పలు వేదికల్లో హాది, నజ్రుల్ కవితల్ని వినిపించేవాడు. షేక్ హసీనా పదవీచ్యుతి సమయంలో హాదిని కొందరు ఈ కాలపు నజ్రుల్ వారసుడిగా ప్రకటించారు.
నజ్రుల్ సమాధి పక్కనే అంత్యక్రియలు ఎందుకు.?
మహ్మద్ యూనస్ ప్రభుత్వం, జమాతే ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంఘం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇది హాది కుటుంబం కోరి అని ఇంక్విలాబ్ మంచా చెబుతోంది. శనివారం అంత్యక్రియల సమయంలో షేక్ హసీనా, అవామీలీగ్, అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసుల మోహరింపు జరిగింది. షాబాగ్ సర్కిల్ పేరును “షాహీద్ హాది” అని మార్చాలని ఇంకిలాబ్ మంచా డిమాండ్ చేసింది.
భిన్న వాదనలు:
నజ్రుల్ ఇస్లాం సమాధికి పక్కనే హాదిని ఖననం చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాజీ నజ్రుల్ ఇస్లాం సహనానికి, లౌకికవాదానికి ప్రతీక అని, ఉస్మాన్ హాదీ తీవ్రవాదానికి, ద్వేషానికి ప్రతీక అని, ఇలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తితో ఎలా పోలుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయ లాభం కోసమే చేశారని అవామీ లీగ్ నేతలు అంటున్నారు. ఒక గుండాను గొప్ప కాజీ నజ్రుల్ ఇస్లాం పక్కన ఖననం చేయడం సిగ్గుచేటు అని బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, హాదీ ఆధిపత్య శక్తులను ఎదురించాడని, ఇద్దరూ కూడా విప్లవ నేతలే అని చెబుతున్నారు.
