Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం అందరిలో అనుమానాలు పెంచుతున్నాయి. దీంతో జైలు ముందు ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే, పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో వివాదం కారణంగానే ఆయనను ఆర్మీ హత్య చేసిందనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్న సమయంలో ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్, ఇమ్రాన్ భార్య బుష్రాబీబీపై అవినీతిపై మాట్లాడినందుకు ఐఎస్ఐ పదవి నుంచి మునీర్‌ను తీసేశారు. పాక్‌లో ఆర్మీ చీఫ్ తర్వాత రెండో అత్యున్నత సైనిక పదవిగా ఐఎస్ఐ చీఫ్ పదవి ఉంటుంది. ఈ విభేదాల కారణంగానే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌పై అసిమ్ మునీర్ కక్ష సాధిస్తున్నాడని పాకిస్తాన్ అంతర్గత సర్కిళ్లలో వినిపిస్తున్న మాట.
పఠాన్ వర్సెస్ పంజాబీ:
పాకిస్తాన్‌లో రాజకీయాల్లో, సైనిక అధికారుల్లో పంజాబీలే అధికంగా ఉంటారు. వీరి డామినేషన్ ఇతర ప్రావిన్సులైన ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, బలూచిస్తాన్‌లో ఉంటుంది. మొత్తం నిధుల్లో పంజాబ్‌కు అగ్ర ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక సైనికుల్లో పంజాబీలే అధికం. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో పంజాబీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో బలూచ్, ఖైబర్ ప్రాంతాల్లో తిరుగుబాటులు ఎదురవుతున్నాయి.
ఇక పంజాబీల తర్వాత, మరో వర్గం ‘‘పఠాన్’’లు. వీరు ఆఫ్ఘాన్ నుంచి పాక్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం వరకు విస్తరించి ఉన్నారు. తమకు చాలా ప్రాంతాల్లో అన్యాయం జరుగుతున్నట్లు పఠాన్‌లు భావిస్తున్నారు. దీంతో పంజాబీల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పఠాన్లు చాలా ఏళ్లుగా నిర్లక్ష్యం, పేదరికం, వివక్షను ఎదుర్కొంటున్నారు. పఠాన్‌ల నేతగా ఇమ్రాన్ ఖాన్‌కు పేరుంది. ఇక పంజాబీ జనరల్‌గా ఆసిమ్ మునీర్ ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటే పాకిస్తాన్ ముక్కలు కావడం ఖాయం.
అసిమ్ మునీర్‌లో భయం:
ఇమ్రాన్ ఖాన్‌ను 800 రోజులకు పైగా జైలులో ఉంచినా కూడా ఆయనకు దేశంలో తిరుగులేని ప్రజాధరణ ఉంది. ఇమ్రాన్ ఒక వేళ ఒక సందేశం ఇస్తే దేశం మొత్తం కదులుతుంది. ఇటీవల రాజ్యాంగ సవరణ ద్వారా అసిమ్ మునీర్ పాక్‌లో ప్రభుత్వం కన్నా శక్తివంతుడిగా మారినప్పటికీ, ఆయనను ఇమ్రాన్ విషయం కలవరపెడుతోంది. పాక్‌లో సైన్యం కన్నా, ఇమ్రాన్ ఖాన్‌కే ప్రజామద్దతు ఉంది. దీంతో ఆర్మీలో తమ పట్టు కోల్పోతున్నామనే భయం ఉంది.
ఇక వేళ ఇమ్రాన్ ఖాన్‌కు చిన్న హాని కలిగినా కూడా పఠాన్ల నుంచి తీవ్ర తిరుగుబాటు ఎదురవుతుంది. ఇప్పటికే సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో విభజన ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను చీమ కుట్టినా కూడా పాక్ నాలుగు ముక్కలు అవుతుందనే భయం మునీర్‌లో ఉంది. ముఖ్యంగా, ఖైబర్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారీ తిరుగుబాటును పాక్ ఆర్మీ ఎదుర్కోవాల్సిందే. ఒక వేళ విడుదల లేకుండా ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నా కూడా, పాక్ ఆర్మీకే ప్రమాదం. ఈ నేపథ్యంలోనే ఆయనను హతం చేయడం లేదా, పాక్ నుంచి వేరే దేశానికి పంపే ప్రయత్నాల్లో పాక్ ఆర్మీ ఉందనేది బహిరంగ రహస్యం.