Bangladesh Unrest: షేక్ హసీనాపై తిరుగుబాటు సమయంలో అట్టుడికిన బంగ్లాదేశ్, మరోసారి ఉద్రిక్తంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత మరణం తర్వాత, ఆ దేశం అల్లర్లతో హింసాత్మకంగా మారింది. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు, హిందువులను టార్గెట్ చేస్తూ రాడికల్ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. గురువారం రాత్రి, దైవదూషణ చేశాడనే ఆరోపణలతో మైమన్‌సింగ్ జిల్లాలో హిందూవ్యక్తి, 30 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను దారుణంగా కొట్టి, చెట్టుకు కట్టేసి తగలబెట్టారు. ఈ ఘటనతో బంగ్లాలోని హిందువులు, ఇతర మైనారిటీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి.
మరోవైపు, రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు బంగ్లాదేశ్ లౌకిక చరిత్రతో సంబంధం ఉన్న మీడియా సంస్థలైన డైలీ స్టార్, ప్రొథమ్ ఆలో వంటి ప్రముఖ దినపత్రిక కార్యాలయాలపై రాత్రిపూట హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఇదే కాకుండా, బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పుపెట్టారు. ముజిబుర్ రెహమాన్ నివసించి, మరణించిన ధన్మొండి 32 వద్ద ఉన్న ఇంటిని నిరసనకారులు కాల్చివేవారు. విధ్వంస సమయంలో నిరసనకారులు జేసీబీ వంటి యంత్రాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పోస్టర్లను కూడా తగలబెట్టారు.
Read Also: Bangladesh Violence: హిందూ వ్యక్తి హత్యపై స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..
పెరిగిన భారత వ్యతిరేకత:
తీవ్ర భారత వ్యతిరేకిగా ముద్రపడిన రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదిని కొన్ని రోజులు క్రితం రాజధాని ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఒక్కసారిగా బంగ్లా హింసాత్మకంగా మారింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అయితే, నిందితులను గుర్తించామని, కాల్పులు జరిపిన వ్యక్తి భారత్ పారిపోయి ఉంటాడని అధికారులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత్‌తో కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీనిపై భారత్ బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి, తన నిరసనను వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ కూడా ఢాకాలోని భారత రాయబారిని పిలిపించి వివరణ కోరింది.
గతేడాది షేక్ హసీనా పదవి కోల్పోయి, భారత్ పారిపోయి రావడానికి హాది ముఖ్యకారణం. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విద్యార్థి నాయకుల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. నిలువెల్లా భారత వ్యతిరేకత కలిగిన హాది, ఇటీవల భారత భూభాగాలతో కలిపి ‘‘గ్రేటర్ బంగ్లాదేశ్’’ మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది జరిగిన తర్వాత రోజే ఇతను హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్ మీడియా సంస్థలకు భారత్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఇస్లామిస్ట్ శక్తులు ఆరోపిస్తూ, దాడులకు పాల్పడుతున్నాయి.
