Site icon NTV Telugu

US: వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!

White House Shooting

White House Shooting

అగ్ర రాజ్యం అమెరికాలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే వైట్‌హౌస్ దగ్గర ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ చెబుతున్నారు. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక కాల్పులు జరిపిన నిందితుడిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిందితుడిని జంతువుతో పోల్చారు. ఆ జంతువు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రూత్ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. కాల్పుల తర్వాత అదనంగా మరో 500 మంది నేషనల్ గార్డ్‌లు మోహరించాలని ట్రంప్ ఆదేశించారు.

కాల్పుల ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ధైర్యవంతులైన గార్డులను చూసి మనమంతా హృదయ విదారకరంగా ఉన్నామన్నారు. వారు ప్రపంచంలోనే అత్యుత్తములు. అలాంటి వారిని కలిగి ఉండటం అదృష్టం. ఇలా జరగడం చాలా దారుణం’’ అంటూ ఎక్స్‌లో జేడీ వాన్స్ పేర్కొన్నారు.

అధ్యక్ష భవనం దగ్గర కాల్పులు జరగడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. సైనికుల కోసం ప్రార్థిస్తున్నామని.. వారి కుటుంబాలకు మా ప్రేమను పంచుతున్నామని ఒబామా ఎక్స్‌లో రాసుకొచ్చారు.

నిందితుడు 29 ఏళ్ల ఆప్జన్ జాతీయుడు రహ్మానుల్లా లకాన్వాల్‌గా గుర్తించారు. 2021లో ఆప్ఘన్‌లో చోటుచేసుకున్న అస్తవ్యస్థమైన పరిస్థితుల కారణంగా అమెరికా వెళ్లిపోయినట్లుగా కనిపెట్టారు. బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు వైట్‌హౌస్ లక్ష్యంగా రహ్మానుల్లా కాల్పులకు తెగబడ్డాడు. తొలుత ఒక మహిళా గార్డుపై కాల్పులు జరిపాడు. ఛాతీపై, తలపై కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం రెండో గార్డుపై కాల్పులు జరిపి.. భౌతికదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం మూడో గార్డ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Hong Kong: హాంగ్ కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం

తొలుత ఇద్దరు సైనికులు చనిపోయారని వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మోరిస్సే ప్రకటించారు. 30 నిమిషాల తర్వాత ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం చెరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

 

Exit mobile version