Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసినందుకు తమను పోలీసులు క్రూరంగా అణిచివేసినట్లు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ – నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాల జైలు వెలుపల, ఆయన పార్టీ మద్దతుదారులతో కలిసి, ముగ్గురూ ఈ వారం నిరసన తెలిపారు. ఈ సమయంలో పోలీసులు తమపై దాడి చేశారని వారు ఆరోపించారు.
Read Also: Karnataka Congress: సిద్ధరామయ్యనా? డీకే శివకుమారా?.. డిసెంబర్ 1న సీఎం పోస్టుపై నిర్ణయం..
అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఉన్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలవడానికి అనుమతించడం లేదని అతడి సోదరీమణులు ఆరోపిస్తున్నారు. తాము ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడనప్పటికీ పోలీసులు తమను క్రూరంగా అణిచివేశారని ముగ్గురు కూడా పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు లేఖ రాశారు. తమను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని 71 ఏల్ల నోరీన్ నియాజీ ఆరోపించారు.
ఆగస్టు 2023 నుంచి అనేక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. పాక్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆయన చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల తర్వాత, పాక్ ప్రభుత్వం ఒక నెల నుంచి సమావేశాలపై అప్రకటిత నిషేధం విధించింది. చివరకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిదిని కూడా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించలేదు. ఏడు సార్లు ప్రయత్నించినప్పటికీ, జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.