Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ‘‘ఇంధన దురాశ’’తో వ్యవహరిస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాలుపంచుకుంటున్నారని, డ్రగ్స్ ముఠాలకు నేతృత్వం వహిస్తున్నారని వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను అమెరికా దాడి చేసి నిర్బంధించిన తర్వాత, రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. ఇదంతా చమురు కోసమే అని అమెరికాపై ఆరోపణలు గుప్పించింది. డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయని అమెరికా తప్పుడు వాదనలు చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి అన్ని అబద్ధపు సాకులు చెబుతోందని అన్నారు.
వెనిజులా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. మేము నిజంగా ఒక ఇంధన శక్తి కేంద్రం, ఇది మాకు అపారమైన సమస్యలను తెచ్చి పెట్టిందని, అమెరికా ఇంధన దురాశ మన దేశ వనరులను కోరుకుంటుందని ఆమె అన్నారు. యూఎస్‌కు వెనిజులా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని, ఇరు దేశాలు ప్రయోజనం పొందే ఇంధన సంబంధాలు తెరిచే ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో రెండు దేశాల సంబంధాల్లో చీలిక ఉందని ఆమె అంగీకరించారు.
స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో రాబోయే బిల్లును ఆమె ప్రకటించారు. అంతర్గత విభజనల్ని పరిష్కరించడానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తీవ్రవాద, ఫాసిస్ట్ సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యక్తీకరణలను అనుమతించమని అన్నారు. ఇవి దేశాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయని అన్నారు. వెనిజులా కొత్త చమురు ఒప్పందం నుంచి వచ్చే ఆదాయాన్ని అమెరికాలో తయారైన వస్తువుల్ని కొనుగోలు చేస్తుందని ట్రంప్ ప్రకటించిన, కొన్ని గంటల తర్వాత వెనిజులా అధ్యక్షురాలి నుంచి ఈ ప్రకటన వచ్చింది.