US Plan Behind Ayman Al-Zawahiri Death: 9/11 ఉగ్రదాడుల వెనుక ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన ఐమన్ అల్-జవహరీని మట్టుబెట్టేందుకు అమెరికా ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, అతడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని ఆచూకీ కోసం స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత జవహరీ ఆచూకీ లభ్యమవ్వడంతో.. అతడ్ని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ రచించారు. తొలుత ఈ ఆపరేషన్‌కు జులై 25వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. అయితే.. అతడ్ని మాత్రమే చంపాలని, కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకూడదని ఈ ఆపరేషన్‌లో ఓ పక్కా రూల్ పెట్టుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి, ఆఫ్ఘాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు.
కాబుల్‌లోని తన నివాసంలో జవహరీ బాల్కనీలో ఉన్నప్పుడు, రెండు హెల్‌ఫైర్ క్షిపణులు అతడ్ని లక్ష్యంగా చేసుకున్నాయి. టార్గెట్ కేవలం జవహర్ ఒక్కడే కాబట్టి, ఫైర్ చేయగా భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. మిగతా భవనమంతా చెక్కుచెదరలేదు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో ఉన్నది జవహరీనే అని ఆ అధికారి కన్ఫమ్ చేసిన తర్వాత దాడులకు దిగింది. ఈ ఆపరేషన్ సమయంలో జవహరీ కుటుంబ సభ్యులందరూ (భార్య, కుమార్తెలు, మనవళ్లు) ఆ భవనంలోనే ఉన్నారట! అయితే.. వారికి ఎలాంటి హానీ కలగలేదని అధికారులు పేర్కొన్నారు. జవహరీ ఉన్న అంతస్తు మాత్రమే కూలిందని, భవనానికి ఏం కాలేదని క్లారిటీ ఇచ్చారు.
జవహరీని మట్టుబెట్టిన తర్వాత వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. డ్రోన్ దాడిలో అతడ్ని అంత చేశామని, 9/11 మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆయనన్నారు. ‘‘ఉద్రవాద నేత అయిన జవహరీని మట్టుబెట్టాం. ఇంకెప్పటికీ అతడు ఆప్ఘనిస్తాన్‌ను ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మార్చలేడు. ఉగ్రవాదులెవరూ మిగలకుండా మేం కచ్ఛితంగా ప్రయత్నిస్తాం. 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన 3000 మంది కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరీ మరణం ఓ ముగింపని భావిస్తున్నా’’ అని బైడెన్ అన్నారు. అనంతరం ట్విటర్‌లోనూ.. ‘అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే, ఎక్కడ దాక్కున్నా, ఎంత కాలమైనా కనిపెట్టి మట్టుబెడతాం’ అని ట్వీట్ చేశారు.