డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. మెక్సికో సరిహద్దులో సైన్యాన్ని దింపి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన అనేక దేశాల ప్రజలను పట్టుకుని తిరిగి పంపించేశారు. ఇందులో భారత పౌరులను కూడా తిరిగి పంపించేసింది.
ఇక అక్రమ వలసలపై అమెరికా ప్రభుత్వం ప్రాథమిక డేటాను మంగళవారం విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం అమెరికా-మెక్సికో సరిహద్దులో కనిష్ట స్థాయికి అక్రమ వలసదారుల సంఖ్య పడిపోయిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్థాయి అని తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా సరిహద్దులో మరిన్ని సైనిక దళాలను రంగంలోకి దింపింది. సరిహద్దులో ఇనుప కంచెలను మరింతగా పెంచారు.
మార్చి నెలలో సరిహద్దు దగ్గర దాదాపు 7,180 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్ప రికార్డ్ అని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి నెలకు సంబంధించిన పూర్తి గణాంకాలు త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది.
2025, జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్రమ వలసలపై కఠిన ఆంక్షలు విధించారు. 2017-2021 తొలి అధ్యక్ష పదవి కాలంలో కూడా ఇలాంటి ఆంక్షలనే ట్రంప్ విధించారు. అప్పుడు కూడా గణనీయంగా అక్రమ వలసలు తగ్గాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: హరిహర వీరమల్లు క్లైమాక్స్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే!