Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించడం, భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడంతో వివాదం తారాస్థాయికి వెళ్లింది. కెనడా చర్యలకు ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇదిలా ఉంటే తాగాజా 41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ కోరింది.
అమెరికాకు ఇండియా కీలకం:
ఇదిలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య అమెరికాకు భయం పట్టుకుంది. కెనడా , అమెరికాకు మిత్రదేశం, సరిహద్దు దేశం, సాంస్కృతికంగా అనేక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం శరవేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ఇటీవల కాలంలో అమెరికా, భారత్ బంధం బలపడింది. అయితే కెనడా-భారత్ వివాదంలో భారత్ తో తమ బంధం ఎక్కడ దెబ్బతింటుందో అని అమెరికా భయపడుతోంది. నిజ్జర్ హత్య తర్వాత అమెరికా మాట్లాడుతూ..భారత్ విచారణకు సహకరించాలని కోరుతోంది. అయితే భారత్ మాత్రం అమెరికా సూచల్ని పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ ఒక్కటే దారి. భారత్ తో చెడితే చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉండదని యూఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కెనడా వివాదం అమెరికాను చిక్కుల్లో పడేస్తోంది. ఇండో-పసిఫిక్ రిజియన్ లో భారత్ చాలా ముఖ్యదేశం. చైనాకు కళ్లెం వేయాలంటే భారత్ అవసరం తప్పనిసరి.ఇక క్వాడ్ కూటమిలో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
భయపెడుతున్న గత అనుభవం:
అయితే గత అనుభవాలను గుర్తు చేసుకుని అమెరికా భయపడుతోంది. 2018లో యూకేలోని సాలిస్‌బరీలో మాజీ రష్యన్ గూఢచారి సెర్గీ స్కీపాల్, అతని కుమార్తెను విష ప్రయోగం చేసి చంపారు. అయితే ఈ హత్యల్లో రష్యా పాత్ర ఉందని బ్రిటన్ ఆరోపించింది. 23 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. నాటో మిత్రదేశాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. అమెరికా 60 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. మిత్రదేశం యూకేకు మద్దతుగా సియాటెల్ లోని రష్యన్ కాన్సులేట్ మూసేయాలని ఆదేశించింది. దీనికి అంతేస్థాయిలో రష్యా కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ లోని యూఎస్ కాన్సులేట్ ని మూసేసింది. అయితే ప్రస్తుతం భారత్, కెనడాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగోతుంది. రష్యా వ్యవహారం అంత సీరియస్ పరిస్థితి లేకున్నా.. పరిస్థితులు ఎటుమలుపు తిరుగుతాయో అని బెంగ పడుతోంది.