ఆఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రక్షణ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని నాటో అధికారులు ప్రకటించారు.
మరోవైపు… ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జన్సన్ స్పందించారు. అక్కడి సంక్షోభంపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు.
తాలిబాన్ల భయంతో దేశం వీడుతున్న ఆఫ్ఘన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సరిహద్దులు దాటి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీ, ఇరాన్ చర్యలు చేపట్టాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పాకిస్థాన్‌తో కలిపి పని చేస్తామని టర్కీ ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థుల తరలిరాకుండా చర్యలు తీసుకుంటోంది టర్కీ.