India’s harsh comments on Pakistan in the UN: భారత్ మరోసారి పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. పాక్ అనుసరిస్తున్న విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని అందిస్తున్న పాకిస్తాన్ వంటి దేశం ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జెనీవాలోని యుఎన్‌హెచ్‌ఆర్‌సి 51వ సెషన్ లో జనరల్ డిబేట్ లో భాగంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ సీమా పూజానీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి ప్రపంచానికి మీ పాఠాలు అవసరం లేదని పాకిస్తాన్ కు సూటిగా చెప్పింది.
Read Also: Doctors Handwriting: ఒట్టేసి చెప్తున్నా.. ఇది నిజంగా డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షనే!
పాకిస్తాన్ తన సొంత మైనారిటీలు అయిన షియాలు, అహ్మదీయాలు, ఇస్మాయిలీలు, హజారాలతో సహా హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులపై అఘాయిత్యాలకు పాల్పడుతుందని భారత్ విమర్శించింది. సిక్కులు, హిందువులు, క్రైస్తవుల అమ్మాయిలను బలవంతంగా వివాహాలు చేసి మతం మారుస్తున్నారంటూ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వేధింపులు, చట్టవిరుద్ద హత్యలు జరుగుతున్నాయని..బలూచిస్తాన్, సింధు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ప్రజలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని విమర్శించింది భారత్.
వేలాది మంది బలోచ్, ఫష్టూన్ లను అపహరించిందని.. ఈరోజు వరకు వారంతా ఏమయ్యారో తెలియదని పాకిస్తాన్ తీరుపై భారత్ వ్యాఖ్యానించింది. మానవహక్కులను ఉల్లంఘిస్తున్న ఉగ్రవాదులను నియంత్రించడంలో పాకిస్తాన్ విఫలం అయిందని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారతదేశం లౌకిక విధానాలపై ద్వేషాన్ని కలిగి ఉన్న పాకిస్తాన్ నుంచి ఇంకేం ఆశించలేం అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని వ్యాపించేందుకు పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగించుకుంటుందని భారత్ ఆరోపించింది.