కొన్ని కొన్ని సార్లు యుద్ధాల వల్ల కూడా లాభం జరుగుతుంది. కానీ అది యుద్ధంలో పాల్గొనే దేశాలకు కాదు. పక్కన ఉండి చూసే వారికి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు అదే జరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ ఎగుమతి చేసే వస్తువులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు మన గులాబీ కూడా చేరింది. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గులాబీ ధరలు గుభాళిస్తున్నాయి. ఊహించని రీతిలో ఎగుమతిదారులకు లాభాలు ఆర్జించి పెడుతున్నాయి.
యుద్ధం కారణంగా యూరప్‌లో గులాబీ సాగు గణనీయంగా పడిపోయింది. దాంతో భారత్ వంటి దేశాల నుంచి ఎగుమతులు పెరిగాయి. ఇప్పటికే ఈ ట్రెండ్ కనిపిస్తోంది. 2021లో గులాబీ ఎగుమతి విలువ 9 కోట్ల 68 లక్షల రూపాయలు. కానీ 2022 నవంబర్ నాటికి అది 18 కోట్ల 34 లక్షలకు చేరింది. యుద్ధం వల్ల ఇందన సంక్షోభం ఏర్పడటంతో యూరప్ రైతులు ఈ శీతాకాలంలో పూలను పెంచకుండా అడ్డుకుంది. పూల సాగుకు అవసరమైన హీటింగ్, కృత్రిమ లైటింగ్, CO2 ఎన్‌రిచ్‌మెంట్ కోసం అధిక శక్తి కావాల్సి వుంటుంది. అన్నింటికంటే లేబర్ ఖర్చులు భరించటం కష్టం. అందుకే శీతాకాలంలో సాగు నిలిపివేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ వరకు భారతీయ పువ్వులకు డిమాండ్ ఉంటుంది. దాంతో కోవిడ్-19 ఎదురుదెబ్బ తర్వాత భారతదేశపు పూల ఎగుమతులు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టే.
పెద్ద సంఖ్యలో పూల పెంపకందారులు సాగు నిలిపివేయటం గత రెండేళ్లేగా ఎగుమతులు కుంటుబడ్డాయి. అయితే, కరోనా కాలంలో దేశీయ మార్కెట్లు రైతులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇక ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. దేశీయ మార్కెట్ కూడా పెరుగుతోంది. ఇది పూల పెంపకందారులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి అవకాశాలున్నాయి. ప్రస్తుతం మనం 2019 ఎగుమతి స్థాయిలకు దగ్గరగా ఉన్నామంటున్నారు అధికారులు. ఐతే, ఎక్స్‌పోర్టర్లకు పెరుగుతున్న సరుకు రవాణా ఖర్చులు భారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 30 శాతం పెరిగాయి. దాంతో విదేశీ కొనుగోలుదారులతో అంత సులభంగా డీలింగ్ సాగట్లేదు.
Read Also: Asia Cup 2023: ఆసియా కప్ విషయంలో బీసీసీఐకి పీసీబీ వార్నింగ్!
భారతీయ గులాబీలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మొత్తం గులాబీ ఎగుమతుల్లో ఒక్క యూకే వాటాయే 35 శాతంగా ఉంది. ఆస్ట్రేలియాకు 19 శాతం, జపాన్కు 18 శాతం ఎగుమతి అవుతున్నాయి. వాలెంటైన్ సీజన్ కోసం మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాల నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.పూణే జిల్లాలోని మావల్ తాలూకా నాణ్యమైన గులాబీ సాగుకు పెట్టింది పేరు. ఇది ప్రధాన పూల ఎగుమతి కేంద్రంగా ఉంది. ఈ వాలెంటైన్ సీజన్‌లో ఎగుమతులు 50 కోట్ల రూపాయలు దాటుతాయని అంచనా. ఇది కొవిడ్ ముందు కన్నా ఎక్కువ. మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ప్రధానంగా గులాబీలను సాగుచేసే రాష్ట్రాలు. ఎగుమతులు ప్రధానంగా ముంబై, బెంగుళూరు విమానాశ్రయాల నుండి జరుగుతాయి. వాలెంటైన్ సీజన్‌లో 60 శాతానికి పైగా గులాబీ ఎగుమతులు ముంబై నుంచే రవాణా అవుతాయి.