ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై వరుస బాంబు దాడులతో విరుచుకుపడింది రష్యా. కీవ్ షాపింగ్ సెంటర్ పై దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది చనిపోయారు. కీవ్ లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. కీలక బ్లాక్ సీ పోర్ట్ శివారులోనూ రెచ్చిపోయాయి మాస్కో బలగాలు. కొన్ని చోట్ల ఉక్రెయిన్ సామాన్య ప్రజలు రష్యా సైన్యానికి ఎదురునిలిచి దాడులు ఆపాలని నిరసనలు తెలుపుతున్నా తగ్గడం లేదు. సుమారు 2,389 మంది ఉక్రెయిన్ దేశ చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రష్యా బీకర దాడిలో ధ్వంసమైన మారియుపోల్ శిథిలాల నుంచి 170మందిని పైగా బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు పుతిన్ ను వార్ క్రిమినల్ గా అభివర్ణించిన బైడెన్ వ్యాఖ్యలకు నిరసనగా, రష్యాలో అమెరికా రాయబారికి సమన్లు పంపింది మాస్కో. అమెరికా, రష్యా బంధాలను మరింత విచ్చిన్నం చేసేలా కామెంట్స్ వున్నాయని నిరసన వ్యక్తం చేసింది.
Read Also: Jagga Reddy: రేవంత్ చర్చలను బయటపెట్టిన జగ్గారెడ్డి..
ఇజ్రాయెల్ ఎటువైపో తేల్చుకోవాల్సిన తరుణమిదేనని, అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్ స్కీ, ఉక్రెయిన్ కు బాసటగా నిలవాలని విజ్ణప్తి చేశారు. స్వయంగా యూదుడైన జెలెన్ స్కీ, యూదు దేశమైన ఇజ్రాయెల్, ఉక్రెయిన్ పక్షాన వుండాలని కోరారు. అటు కీవ్, ఖార్కివ్, మరియూపోల్ ను స్వాధీనం చెయ్యాలన్న రష్యా అల్టిమేటంపై స్పందించిన జెలెన్ స్కీ, ఎట్టి పరిస్తితుల్లోనూ సరెండరయ్యే పరిస్థితేలేదన్నారు. మరోవైపు పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన పెరిగేకొద్దీ రష్యా మరింత పట్టుదలతో దాడులు పెంచుతోంది. ఇప్పటికే కింజల్ హైపర్ సోనిక్ క్షిపణులను కూడా బరిలోకి దించడంతో.. భవిష్యత్తులో వ్యూహాత్మక అణ్వాయుధాలు కూడా వాడే ప్రమాదం ఉందన్న ఆందోళన కలిగిస్తోంది. మొత్తానికి 26 రోజులకు పైగా సాగుతున్న యుద్ధం అంతేలేకుండా సాగుతోంది. పట్టూవిడుపుల్లేకపోవడంతో, ఇరువర్గాల చర్చల్లో పురోగతి కనిపించడం లేదు.