UK PM Liz Truss makes U-turn on tax after week of market turmoil: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే ఒక విషయంలో యూ-టర్న్ తీసుకుంది. సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్నయాన్ని ఆమె వెనక్కు తీసుకున్నారు. సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో లిజ్ ట్రస్ చెప్తూ వచ్చింది. అందుకు అనుగుణంగా.. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన మినీ బడ్జెట్‌లో దానికి సంబంధించిన ప్రకటన చేశారు. అధిక ఆదాయం కలిగిన సంపన్నులకు ఆదాయపు పన్నులో 45 శాతం మేర కోత విధిస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా ఛాన్సిలర్ క్వాసీ క్వార్టెంట్ చెప్పారు.
అయితే.. మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. పైగా.. డాలర్‌తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ కూడా భారీగా పతనమైంది. దీనిపై దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను కోత ప్రణాళికను ప్రకటించడంతో.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో.. పన్ను కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఛాన్సిలర్ క్వాసీ క్వార్టెంట్ వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దేశ వృద్ధి గురించే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వాలు తమ విధానాల్ని మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ విషయంపై ప్రధాని లిజ్ ట్రస్ కూడా ట్వీట్ చేసింది. బ్రిటన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్న తమ నిర్ణయానికి ఈ పన్ను కోత అంశం అడ్డంకిగా మారిందని.. వృద్ధికి చర్యలు తీసుకుంటూ, దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. కాగా.. పన్ను కోత నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన లిజ్ ట్రస్, ఇప్పుడు సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.