US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

  • AI రేసులో చైనాపై అమెరికా ఆధిక్యం
  • అభివృద్ధిని ఆపితే ఓడిపోతాం
Trump

Trump

Donald Trump AI comments: కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. AI అభివృద్ధిని నెమ్మదింపజేయాలని కొందరు నిపుణులు చేస్తున్న సూచనలను ఆయన తోసిపుచ్చారు. అభివృద్ధిని అడ్డుకుంటే అమెరికా, చైనా మధ్య జరుగుతున్న AI పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “AIని ఎవరు గెలిస్తే వారిదే విజయం” అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్‌లోని డూన్‌బెగ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. AIపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వారిని ‘నెగెటివ్‌ ఫోర్సెస్‌’గా అభివర్ణించారు.

AIలో చైనాపై అమెరికా ఆధిక్యంలో ఉంది: ట్రంప్‌

AI పోటీలో అమెరికా చైనాకంటే ముందుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక సామర్థ్యాలు కలిగిన దేశంగా అమెరికా కొనసాగుతోందని అన్నారు. “AIని ఎవరు గెలిస్తే వారిదే విజయం. అమెరికా ఈ స్థాయిని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను.” AI అభివృద్ధికి కొన్ని నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమైనప్పటికీ, అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడం సరైన నిర్ణయం కాదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. AI వల్ల జరగబోయే ప్రమాదాలపై కొందరు చేస్తున్న హెచ్చరికలు వాస్తవంలో జరగకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

AI అభివృద్ధిని నెమ్మదించాలన్న ఆంథ్రోపిక్‌ CEO

ప్రముఖ AI సంస్థ Anthropic సీఈఓ డారియో అమోడీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో వచ్చాయి. AI మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అమోడీ తన బ్లాగ్‌ పోస్టులో సూచించారు. ‘We Must Pace The Frontier’ పేరుతో రాసిన బ్లాగ్‌లో AI సామర్థ్యాలు ప్రస్తుత వేగంతో అభివృద్ధి చెందితే, మానవుల మేధో సామర్థ్యాలను మించిపోయే స్థాయికి చేరుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

12 నెలల్లోనే ఇంటర్నెట్‌పై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం?

AI అభివృద్ధి ప్రస్తుత వేగంతో కొనసాగితే, రాబోయే 6 నుంచి 12 నెలల్లోనే AI వ్యవస్థలు ఇంటర్నెట్‌పై పూర్తి నియంత్రణ సాధించే స్థాయికి చేరుకోవచ్చని అమోడీ హెచ్చరించారు. అయితే ఇది ఆయన వ్యక్తం చేసిన అంచనా మాత్రమే. AI సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని తగ్గించాలని కోరారు. అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వల్ల మానవాళికి ఉపయోగకరమైన సాంకేతిక ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని, మరోవైపు వేగంగా అభివృద్ధి చేయడం కూడా ప్రమాదకరమని వివరించారు. ఈ రెండు పరిస్థితుల మధ్య సమతుల్య మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అమోడీ పేర్కొన్నారు.

అమోడీకి మద్దతుగా సామ్‌ ఆల్ట్‌మన్‌, ఎలాన్‌ మస్క్‌

AI అభివృద్ధి వేగం, భద్రతపై అమోడీ చేసిన వ్యాఖ్యలకు Sam Altman, Elon Musk మద్దతు తెలిపారు. AIలో సూపర్‌ఇంటెలిజెంట్‌ కంప్యూటర్‌ వ్యవస్థలు అభివృద్ధి చెందే కొద్దీ, మానవ నియంత్రణకు సంబంధించిన ప్రశ్నలు మరింత కీలకంగా మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం వల్ల అమెరికా, చైనా వంటి దేశాల మధ్య సాంకేతిక పోటీలో వెనుకబడే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అధునాతన AI మోడళ్లకు భద్రతా సమీక్ష

అమెరికా ప్రభుత్వం అధునాతన AI మోడళ్లను విడుదల చేయడానికి ముందు స్వచ్ఛంద భద్రతా సమీక్ష ప్రక్రియను అమలు చేస్తోంది. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ప్రమాణాలు, నియమాలు స్పష్టంగా లేవని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం సాంకేతిక రంగంతో పాటు అనేక పరిశ్రమల్లో తక్కువ నియంత్రణలు, సడలింపుల విధానాన్ని అనుసరిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో AI భద్రతా సమీక్ష ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

AI రేసులో అమెరికా–చైనా పోటీ

AI రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అధునాతన AI మోడళ్లు, డేటా సెంటర్లు, చిప్‌ టెక్నాలజీ, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధిలో ఇరు దేశాలు ముందంజ కోసం ప్రయత్నిస్తున్నాయి. AI ఆధిపత్యం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ, సైనిక సాంకేతికత, సైబర్‌ భద్రత, ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే AI అభివృద్ధిని నెమ్మదించాలన్న హెచ్చరికలు, వేగాన్ని కొనసాగించాలన్న ప్రభుత్వాల వైఖరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలతో అమెరికా AI ఆధిపత్యంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లయింది.