Trump sues CNN claiming defamation: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎన్ఎన్ మీడియా సంస్థపై ఏకంగా 475( సుమారుగా 3,900కోట్లు) మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సీఎన్ఎన్ వార్తకథనాలు ప్రచురించిందని కోర్టులో సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నారు ట్రంప్. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తకథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో 29 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
రాజకీయంగా తనను ఓడించడానికి సీఎన్ఎన్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. 2024లో అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేస్తానని సీఎన్ఎన్ భయపడుతోందని.. అందుకే నాపై దాడి చేస్తోందని పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై స్పందించేందుకు సీఎన్ఎన్ నిరాకరించింది. ట్రంప్ ను హిట్లర్ గా పిలవడంతో పాటు జాత్యాంహకారి, రష్యన్ లాకీ, తిరుగుబాటువాది అని అనేక సందర్భాల్లో ట్రంప్ గురించి తప్పుగా వ్యాఖ్యానించిందని దావాలో పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి 7,700 సార్లు తనను అబద్ధపు మోసకారిగా సీఎన్ఎన్ అభివర్ణించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఇతర మీడియా సంస్థలపై కూడా వ్యాజ్యాలు దాఖలు చేస్తానని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read Also: Munugode Bypoll: మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం.. రేపే అభ్యర్థి ప్రకటన?
2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఓడిపోయారు. రెండోసారి అధ్యక్షుడు కావాలనుకున్న ట్రంప్ కు నిరాశే ఎదురైంది. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడే ఆలోచనలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో సీఎన్ఎన్ ను ‘‘ క్లింటన్ న్యూస్ నెట్వర్క్’’గా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్.
ఇటీవల ట్రంప్ కు సంబంధించిన ఫ్లోరిడాలోని మార్ -ఏ-లాగో ఎస్టేట్ లో ప్రభుత్వ రికార్డులను దాచాడనే ఆరోపణలపై అతని నివాసంపై దాడులు చేశారు. యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన ఆస్తుల విలువపై బ్యాంకులు, బీమా సంస్థలకు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తూ.. న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ లెటిసియా జేమ్స్ పై గత నెలలో ట్రంప్ దావా దాఖలు చేశారు.