Site icon NTV Telugu

Trump: ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ వీడియో పోస్ట్.. డెమోక్రాట్లు మండిపాటు

Obama3

Obama3

బరాక్ ఒబామా.. రెండు పర్యాయలు అగ్ర రాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచిత చర్యకు పాల్పడ్డారు. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో ‘‘ది లయన్ స్లిప్స్ టునైట్’’ పాట ప్లే అవుతుండగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ముఖాలు కోతి రూపాల్లో ఒక క్షణం పాటు కనిపించాయి. అంతేకాకుండా 2020 ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు.

ట్రంప్‌ పోస్ట్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది చాలా అసహ్యకరమైన ప్రవర్తన అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడి అసహ్యకరమైన ప్రవర్తన. ప్రతి ఒక్కరు రిపబ్లికన్ నేత తీరును ఖండించాలి.’’ అని న్యూసమ్ ఎక్స్‌లో రాశారు. చరిత్రలో ట్రంప్ ఒక మచ్చ అని.. ‘‘జాత్యహంకరం’’ అని మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఒబామా సన్నిహితుడు బెన్ రోడ్స్ అభివర్ణించారు. ఇక డెమోక్రాట్ల విమర్శలను ‘‘నకిలీ ఆగ్రహం’’గా వైట్‌హౌస్ కొట్టిపారేసింది.

ట్రంప్ గతంలో కూడా ప్రపంచ నాయకులను ఏఐ సాయంతో ఎగతాళి చేశారు. గత సంవత్సరం ఓవల్ కార్యాలయంలో ఒబామాను అరెస్ట్ చేసినట్లుగా.. నారింజ రంగు జంప్‌సూట్‌లో కటకటాల వెనుక ఉన్నట్లుగా రూపొందించిన వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.

 

 

Exit mobile version