వెనిజులా తీరంలో మరోసారి అమెరికా దాడి చేసింది. తీరంలో వేగంగా దూసుకెళ్తున్న నౌకపై అమెరికా దళాలు దాడులు చేయడంతో ఆరుగురు నార్కో ఉగ్రవాదులు మరణించారని ట్రంప్ తెలిపారు. గత కొద్దిరోజులుగా వెనిజులా తీరంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న నౌకలపై అమెరికా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలువురు హతమయ్యారు. అంతర్జాతీయ జలాల్లో ఇలా దాడి జరగడం ఇది ఐదో సంఘటన కావడం విశేషం.
మంగళవారం సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో… ఈ దాడి అంతర్జాతీయ జలాల్లో జరిగిందని.. అమెరికా సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని అన్నారు. నౌకలో మాదకద్రవ్యాలు ఉన్నట్లుగా తెలిపారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధం ఉందని ఇంటెలిజెన్స్ గుర్తించినట్లుగా తెలిపారు. మంగళవారం జరిగిన దాడికి రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఆదేశించారని.. గత దాడుల మాదిరిగానే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా విడుదల చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.
వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో గత వారం మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా ప్రభుత్వం చేస్తున్న వాదనలు తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. బలవంతపు పాలన మార్పు ప్రయత్నాలను చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ముప్పును వెనిజులా తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న దుహంకారాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘ఇది రాజకీయ వ్యతిరేక, మానవ వ్యతిరేక, యుద్ధోన్మాదం, మొరటు, అసభ్యకరం’’ అని పేర్కొన్నారు.