కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా కారణంగా అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ట్రయల్స్ దశలో ఉండగానే ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తాజాగా ట్రంప్ ఓ మీడియాకు ఇంటర్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగానే అమెరికాలో మరణాల సంఖ్యను తగ్గించగలిగామని చెప్పారు. తమ ప్రభుత్వం 200 మిలియన్ డోసుల ఫైజర్, 200 మిలియన్ డోసుల మోడెర్నా టీకాలకు ఆర్డర్లు ఇచ్చిందని గుర్తు చేశారు. సకాలంలో ప్రజలకు వ్యాక్సిన్ అందించడం వలనే ఇప్పుడు మరణాల సంఖ్య తగ్గినట్టు ఆయన తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేసినా 10 కోట్ల మంది అమెరికన్ల ప్రాణాలు పోయేవని అన్నారు. చైనా నుంచి కరోనా వచ్చిందని అనేక సందర్భాల్లో ట్రంప్ చెబుతూ వచ్చారు. ల్యాబ్ నుంచి వైరస్ లీకైనట్టు ఆయన గతంలో పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ చెప్పిన విషయాలను అప్పట్లో కొట్టిపారేసినా, ఇప్పుడు ల్యాబ్ నుంచి లీక్ ఆయ్యి ఉండొచ్చనే అనుమానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెలుబుచ్చింది.
Read: టాలీవుడ్ ప్రిన్స్ కు సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు