Site icon NTV Telugu

Trump: వాళ్లిద్దరూ మంచి దోస్త్‌లు.. ఏప్రిల్‌లో దక్షిణాసియా వస్తున్నట్లు ట్రంప్ ప్రకటన

Trump1

Trump1

దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ పుతిన్, జిన్‌పింగ్‌లను ప్రశంసించారు. వారిద్దరితో మంచి సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నట్లు తెలిపారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అద్భుతమైన విజయాలు సాధించిన ‘‘అద్భుతమైన వ్యక్తి’’గా కొనియాడారు. అదే సమయంలో జిన్‌పింగ్- రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే కోవిడ్-19 తర్వాత జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు.

‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నాకు ఎల్లప్పుడూ చాలా మంచి సంబంధం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అద్భుతమైన వ్యక్తి. ఆయన చేసిన పని అద్భుతమైనది. ఆయనను అందరూ ఎంతో గౌరవిస్తారు. కోవిడ్ వల్ల చాలా అంతరాయం కలిగింది. నేను దీనిని చైనా వైరస్ అని పిలిచేవాడిని.. కానీ మీరు వేరే పేరును ఉపయోగించవచ్చని మీరు అనుకుంటున్నారా? నేను అలా చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దాని గురించి మనకు ఎందుకు సమస్య ఉండాలి?.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్- బీజింగ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు పునరుద్ధరించేందుకు ఏప్రిల్‌లో చైనాను సందర్శించాలని యోచిస్తున్నట్లు ట్రంప్ ధృవీకరించారు.

ఇక గాజా పరిపాలన కోసం ట్రంప్ ప్రపంచ దేశాలతో శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ట్రంపే స్వయంగా ఆయా దేశాలను ఆహ్వానించారు. అయితే శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తన నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారని ట్రంప్ తెలిపారు. అయితే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని.. తగిన సమయంలో పుతిన్ స్పందిస్తారని… ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Exit mobile version